Politics Of Three Capitals: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి ఎనిమిదేళ్లయిది. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే మూడేళ్ల క్రితం వరకు అమరావతి అనేవారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడంతోపాటు గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే ఈ బిల్లులు న్యాయసమీక్షకు నిలబడకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. అసెంబ్లీలోనూ మరోసారి మూడు రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టలేదు. అయితే తాజాగా మరోసారి ఈ రెండు పనులు చేసేందుకు సిద్ధవుతున్నట్లు తెలుస్తోంది.

తాను పట్టిన కుందేలుకు ‘మూడే’కాళ్లు అన్నట్లు..
ఎనుకటికి ఎవరో తాను పట్టిన కుందేలుకు ‘మూడే’ కాళ్లు ఉన్నాయన్నారట. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరు కూడా అలాగే ఉంది. చరిత్రలో చంద్రబాబు పేరు నిలిచిపోవద్దన్న ఒకే ఒక్క కారణంతో అమరావతి రాజధాని స్థానంలో వైసీపీ సర్కర్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం కూడా తెలిపింది. అయితే దీనిపై హైకోర్టు తీర్పు తర్వాత సర్కార్ మౌనంగా ఉండిపోయింది. తాజాగా మళ్లీ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. చంద్రబాబు పేరు చరిత్రలో ఉండొద్దని.. తన చరిత్రే ఉండాలని భావిస్తున్న జగన్ అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. ముందుకే వెళ్లాలని భావిస్తున్నారు.
ద్విముఖ వ్యూహంతో..
మూడు రాజధానులపై జగన్ సర్కార ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతోపాటు అసెంబ్లీలోనూ మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేని నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఏర్పడింది.
కోర్టు పరిధినే ప్రశ్నించి..
అమరావతి స్ధానంలో వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులు చెల్లవని పేర్కొంటూ హైకోర్టు గతంలో కీలక తీర్పు ఇచ్చింది. దానిపై సీఎం జగన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి హైకోర్టుకు, జడ్డీలకు తమ పరిధిని గుర్తుచేశారు. అయితే హైకోర్టు తీర్పుపై హైకోర్టులోనే అప్పీలుకు వెళ్లడం కానీ, సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కానీ చేయలేదు. మూడు రాజధానులపై సాంకేతిక కారణాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం అసాధ్యమని అంతా భావించారు. కానీ తిరిగి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పడంతో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది.
అసెంబ్లీలో బిల్లుకు రెడీ
మూడు రాజధానులపై ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో మరోసారి బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకన్న నేపథ్యంలో వాటిని సరిచేసి కొత్త బిల్లు ప్రవేశపెడతామని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. దీంతో కొత్త రాజధానులు వస్తాయని విశాఖ, కర్నూలు ప్రజలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే అంతకు ముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి స్టే ఉత్తర్వు తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏడాదిలో ఎన్నికలు..
ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపు కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తే మాత్రం 2023లోనే ఎన్నికలు ఉండొచ్చు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో జగన్ సర్కార్ కనిపిస్తోంది. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కూడా సహకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో అసెంబ్లీలో మాత్రం పూర్తి మద్దతు లభిస్తోంది. దీంతో గట్టిగా ప్రయత్నిస్తే ఏడాదిలోపు మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం వైసీపీ సర్కార్ భావిస్తోంది.