Posani- Ali: ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి. గత ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో సేవలు చేసిన వారికి ఆశించిన పదవులు దక్కలేదు. దీంతో అందరిలో నైరాశ్యం నెలకొంది. సినీ నటులు పోసాని కృష్ణమురళి, ఆలీ, మోహన్ బాబు, పృధ్వీ సహా చాలా మంది వైసీపీని నమ్ముకుని నట్టేట మునిగారు. ప్రభుత్వ అండ చూసుకుని అందరిని చెడామడా తిట్టేయడంతో ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. ఇటు ప్రభుత్వం కూడా ఏ పదవి ఇవ్వడం లేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా వారి పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది.

గతంలోనే పోసాని, ఆలీకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని ప్రచారం సాగినా అదంతా వట్టిదే అని తేలిపోయింది. ఇక ప్రభుత్వం కూడా ఓ ఏడాదిన్నర మాత్రమే అధికారంలో ఉంటుంది. ఇక ఈ కాలంలో పదవి తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదనే తెలుస్తోంది. అందుకే పదవుల కోసం ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. పార్టీ కోసం ఎంత సేవ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అయిందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పోసాని, ఆలీలకు కార్పొరేషన్ లలో పదవులు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీపై సినిమా వాళ్లకు ఆగ్రహం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వీరు వైసీపీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ను నమ్ముకుని మోసపోయామనే భావం నటుల్లో వస్తోంది. పృథ్వీ అయితే రోజుకు లక్షల్లో తీసుకునే నటుడు కానీ వైసీపీ అండ చూసుకుని అందరిని నానా రకాలుగా దుర్భాషలాడటంతో అతడికి అవకాశాలు రాకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. మిగతా నటులకు అవే పరిస్థితులు ఎదురు కావడంతో వైసీపీ తీరుతో సినిమా నటులకు నష్టాలే కలుగుతున్నాయి.

ప్రస్తుతం వైసీపీకి వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. దీంతోనే రాబోయే ఎన్నికల్లో ఎదురీదే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ను నమ్ముకున్న వారిని నట్టేట ముంచారనే వాదనలు సైతం వస్తున్నాయి. సినిమా రంగమే కాకుండా ఎన్నో రంగాలకు చెందిన పలువురు జగన్ కు సాయం చేసినా వారిని మాత్రం జగన్ పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో ఆగ్రహం పెరుగుతోంది. ఇక జగన్ ను నమ్ముకుంటే నట్టేట్లో మునగాల్సిందే అనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. దీని ఫలితం జగన్ పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని అధికారం కోసం ఎన్ని పాట్లు పడాల్సి వస్తోందో తెలియడం లేదు.
జగన్ తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచి ఏదో సాయం చేయాల్సి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం కోసం పనిచేసిన వారి కోసం ఏవో పదవులు ఇస్తే సరిపోయేది. కానీ జగన్ మొండిగా వ్యవహరించడంతోనే చిక్కులు ఎదుర్కొంటారని తెలుస్తోంది.