Homeఆంధ్రప్రదేశ్‌Politics- Media: రాజకీయాలు.. మీడియా.. మరీ ఇంత దిగజారిపోయాయా?

Politics- Media: రాజకీయాలు.. మీడియా.. మరీ ఇంత దిగజారిపోయాయా?

Politics- Media: తెలుగునాట ఎప్పుడూ లేనంత విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సైద్ధాంతిక పోటీ కాస్తా వ్యక్తిగత వైరంలా మారిపోయింది. ప్రత్యర్థులు కాస్తా శత్రువులుగా మారిపోతున్నారు. రాజకీయ నేతలు వరకూ పర్వాలేదు కానీ.. మీడియా ను కూడా రాజకీయాలు ఆపాదించి విభజిస్తున్నారు. రాజకీయ పార్టీలు సొంత పేపర్లు, చానళ్లు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఈ విభజన అనివార్యంగా మారింది. కానీ మిగతా మీడియాను కూడా అదే గాడిన కట్టేస్తున్నారు. రాజకీయ పార్టీలు మీడియాను బ్యాన్ చేయడం ప్రారంభించాయి. ఏపీలో అధికార పార్టీ ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి చానళ్లు, పత్రికలను ఏనాడో బ్యాన్ చేశాయి. ఒక్క సాక్షిని తప్పించి అవసరమనుకుంటే తప్ప మిగతా మీడియాకు కార్యక్రమాలకు అనుమతి లభించడం లేదు. ప్రభుత్వపై విష ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ వ్యతిరేక మీడియాను దుష్టచతుష్టయంతో పోల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది ఏ వేదికైనా సీఎం జగన్ ఆ మీడియా ప్రస్తావనకు తెచ్చి తూర్పారపడుతున్నారు. మీడియా యాజమాన్యాల వైఖరిపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మీడియా చర్చాగోష్టిలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీచేశారు. అసలు ఎక్కడా ఆ మీడియాతో మాట్లాడవద్దని కూడా శ్రేణులకు ఆదేశించారు.

Politics- Media
Politics- Media

ఆ రెండు చానళ్లపై టీడీపీ…
అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు కూడా సాక్షి మీడియాపై నిషేధం విధించారు. టీడీపీ కార్యక్రమాలకు సాక్షి మీడియాకు ఆహ్వానించడం లేదు. కార్యక్రమాలకు పిలవడం మానేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ నిషేధం విధించారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. తాజాగా టీడీపీ ఎన్టీవీ, టీవీ9 ను కూడా బ్యాన్ చేసినట్టు ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపకపోగా తిరిగి టీడీపీపై దుష్ప్రచారం చేస్తుండడమే ఇందుకు కారణం. ప్రజలను కులాలు, వర్గాలుగా విభజించి చూస్తున్నారని ఈ రెండు చానళ్లపై టీడీపీ మోపుతున్న అభియోగం. అందుకే ఇది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తొంది. ఇన్నాళ్లు తటస్థ మీడియా జాబితాలో ఉన్న ఈ రెండు చానళ్లు ఇప్పుడు చంద్రబాబుకు నీలిమీడియాగా కనిపిస్తుండడం విశేషం.

టీన్యూస్, నమస్తే తెలంగాణ రిపోర్టర్లకు అవమానం..
అటు తెలంగాణలో కూడా మీడియా పై బ్యాన్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటించారు. అందులో భాగంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. దానికి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ చానళ్ల రిపోర్టర్లు వచ్చారు. కానీ బీజేపీ నాయకులు వారిని తిప్పి పంపించారు. ఓ రకంగా చెప్పాలంటే గెంటేశారన్న ప్రచారం నడుస్తోంది. దాదాపు ఆ రెండు మీడియాలను బీజేపీ బ్యాన్ చేసిందనిపిస్తోంది. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ చానల్ టీఆర్ఎస్ పార్టీకి చెందినవి. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ తో బీజేపీకి పోరు నడుస్తోంది. అలాగని బీజేపీకి అధికారికంగా మీడియా లేకపోయినా.. అనుకూలంగా వ్యవహరించే యాజమాన్యాలు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఆ రెండు మీడియాలపైనే ఆంక్షలు పెట్టింది. మున్ముందు పార్టీ ల బ్యాన్ జాబితాలో చాలా మీడియా సంస్థలు చేరే అవకాశముంది.

Politics- Media
Politics- Media

మారుతున్న మీడియా పాత్రలు..
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది తెలుగునాట మీడియా సంస్థల పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే పాలక పక్షానికి.. ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్దిని చూపితే ప్రతిపక్షానికి ఆ మీడియా వ్యతిరేకంగా మారిపోతోంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మీడియా పాత్రలు కూడా మారిపోతున్నాయి. అప్పటివరకూ వ్యతిరేకంగా ఉన్నవారే అనుకూలంగా మారిపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి వ్యతిరేకంగా కనిపించాయి. వాటిపై కేసీఆర్ ఉక్కుపాదం మోపిన సందర్భాలున్నాయి. తరువాత వాటి విషయంలో కేసీఆర్ స్వరం మారింది. అటు ఎన్టీవీ కూడా రిజర్వ్ గా ఉంటుందన్న భావన అందరిలో ఉండేది. కానీ ఇటీవల ఆ చానల్ స్వరం మార్చకుంది. ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా మారిందన్న టాక్ నడుస్తోంది.అయితే పెరిగిన నిర్వహణ వ్యయంతో ప్రభుత్వానికి దగ్గరగా ఉంటేనే ప్రకటనల రూపంలో కాస్త ఆదాయం సమకూరేది. కానీ ప్రభుత్వాలు కూడా సొంత మీడియాకే ప్రకటనలు భారీగా ఇస్తున్నారు. మిగతా మీడియాను విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా యాజమాన్యాల్లో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల వెనుక వ్యతిరేక, అనుకూల ధోరణులు మారుతున్నాయి. బ్యాన్ ల వరకూ దారితీస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version