Atrocities Of YCP Leaders: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే పోలీస్ కేసులు.. నిలదీస్తే భౌతిక దాడులు.. ఎదురుతిరిగితే అంతమొందించేందుకు యత్నాలు…ఇదీ ఏపీలో ప్రస్తుతమున్న పరిస్థితులు.. రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత వైరంగా మారిపోతోంది. మనిషి ప్రాణాలను తీసేందుకు పురిగొల్పుతోంది. మనిషిని మనిషే వేటాడే అటవిక రాజ్యంలా ఏపీ మారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హింసా రాజకీయాలు పెరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నించే విపక్ష నాయకులను పట్టుబట్టి జైలుకు పంపిస్తున్నారు. విపక్షంలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. మాజీ స్పీకర్ కోడెల బలవన్మరణానికి పాల్పడేలా వేదించారు. మాజీ మంత్రులు, కీలక నాయకులపై ఇప్పటివరకూ వందలాది కేసులు పెట్టారు. నేరుగా టీడీపీ కార్యాలయంపైనే దాడి చేశారు. విపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులను నిర్బంధిస్తున్నారు. వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. అటు భౌతిక దాడులకు దిగుతున్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు.

మాజీ కార్పొరేటర్ కన్నునే పోడిచేశారు..
తాజాగా విజయవాడలో మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీన కన్నునే పొడిచేశారు. అందరూ చూస్తుండగానే వైసీపీ నాయకులు దాడిచేసి…కంట్లో ఇనుప చువ్వలను దించేశారు. దీంతో బాధితుడు కన్ను పోగొట్టుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గాంధీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు,. నాలుగు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందాడు. ప్రస్తుతం ఆయన భార్య 9వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. డివిజన్ లో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో శనివారం మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందితో కలిసి పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా వైసీపీ నాయకులు మూకుమ్మడి దాడి చేశారు. మా ప్రభుత్వ హయాంలో మీరు పనిచేయడమేమిటని కింద పడేసి దాడిచేశారు. అంతటితో ఆగకుండా ఇనుప చువ్వలతో దాడిచేయడంతో గాంధీ కన్ను దెబ్బతింది. స్థానికులు అడ్డుకోవడంతో వైసీపీ మూకలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. దీంతో హుటాహుటిన స్థానిక ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాథమిక వైద్యం చేసి హైదరాబాద్ కు తరలించారు. అక్కడి వైద్యులు గాంధీ ఒక కన్ను పొయినట్టు ధృవీకరించారు. మరో కన్నుకు ఇన్ ఫెక్షన్ సోకకుండా వైద్యసేవలందిస్తున్నారు. ఈ ఘటనతో విజయవాడలో పెద్ద దుమారమే రేగింది. ప్రశాంతతకు అలవాటుపడిన నగరవాసులు ఈ ఘటనతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
అక్కసుతోనే…
పడమటిలంక.. విజయవాడ రాజకీయాలకు కేరాఫ్ అడ్డా. ఏటా ఇక్కడ వినాయక వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పూజలు జరుపుకొవడం ఆనవాయితీ. ఇటీవల రాజకీయ మార్పుల నేపథ్యంలో కొందరు అధికార పార్టీ వైపు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వినాయక నవరాత్రులు జరుపుకుంటుండగా.. వైసీపీ నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించకపొవడంతో వివాదం రేగింది. దాని పర్యవసానమే గాంధీపై దాడి అని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రశాంత విజయవాడ గాంధీపై దాడితో ఉలిక్కిపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో ఇటువంటి దాడులు పెరిగాయయన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి., ఇటువంటి ఘటనలు శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తాయని నగరవాసులు భావిస్తున్నారు. వైసీపీ అల్లరి మూకల చర్యలను అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
అయితే ఇటీవల అధికార వైసీపీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా అధికమయ్యాయి. ఎక్కడైనా ప్రశ్నిస్తుంటే నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారు. వీటిపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. సాక్షాత్ టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న వారిపై ఇంతవరకూ చర్యలు లేవు. తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు నమోదయ్యాయి. మొన్నటి కుప్పం ఎపిసోడ్ నుంచి నిన్నటి గాంధీపై దాడి వరకూ రాష్ట్రంలో దాదాపు పది మంది టీడీపీ నాయకులపై దాడులు జరిగాయి. కానీ ఎక్కడ నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదు. అరెస్టులు చేయలేదు. దీంతో ఇటువంటి దాడులు చేస్తున్నవారికి ఊతమిచ్చినట్టవుతోంది. మొత్తానికైతే రాష్ట్రం రోజురోజుకూ రావణకాష్టంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. . .