రాజకీయ పార్టీల అర్థం జనం మరిచిపోయారు. కాదు.. కాదు.. నేతలు మార్చేశారు. కేవలం అధికారం అనుభవించడానికి పోటీపడే గ్రూపులుగా అవి మారిపోయాయి. కానీ.. రాజకీయం అసలు ఉద్దేశం ప్రజాసేవ. జనానికి సేవ చేయడానికి అన్నీ వదులుకుని వచ్చేవారు గత నాయకులు. తమ వద్ద ఉన్న ఆస్తులు, అంతస్తులు అమ్ముకొని కొందరు.. తమ భవిష్యత్ త్యాగం చేసి మరికొందరు రాజకీయాల్లో చేరేవారు. మరి, ఇలాంటి వారికి కార్యక్రమాల నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ వదిలేసిన వారికి ఖర్చులకు పైసలు ఎలా వస్తాయి? అన్నప్పుడు.. ఇందుకున్న ఏకైక మార్గం విరాళాల సేకరణ. తాము ప్రజల కోసమే పని చేస్తున్నాము కాబట్టి.. ఆ పనికోసం వారి నుంచే విరాళాలు అడుక్కొని కార్యక్రమాలు చేసేవారు. ఇందుకోసం ఇళ్లిళ్లూ తిరిగేవారు.
వసూలు చేసిన విరాళాల్లో కొంత పార్టీ కార్యక్రమాలకు, పూర్తిగా రాజకీయాలకే అంకితమైన వారు పొట్ట పోసుకోవడానికి కొంత సర్దు బాట్లు చేసుకుంటూ.. ఒక పూట తినీ తినక రాజకీయాలు చేసేవారు గతంలో! కానీ.. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఈ విరాళాల స్థాయి పది, ఇరవై రూపాయలు దాటి.. వందలు, వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది. ఇందులో ప్రధాన జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మొదలు.. ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ ఉన్నాయి. ఈ నిధులతో వీరు చేస్తున్న ప్రజాఉపయోగమైన రాజకీయాలు ఏంటన్న చర్చ తర్వాత. ఈ విరాళాలతో వీరేం చేస్తున్నారన్న లెక్క కూడా తర్వాత చూడొచ్చు.
కానీ.. వీళ్లకు ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అనే లెక్క మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి. విరాళాలు తీసుకుంటున్నప్పుడు ఒక రశీదు ఇస్తారు. ఇవ్వాలి కూడా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఇచ్చిన వ్యక్తి దగ్గర లెక్క ఉండాలి. ఎవరి నుంచి తెచ్చుకున్నారో రాజకీయ పార్టీల దగ్గర కూడా లెక్క ఉండాలి. కానీ.. ఇప్పుడు జాతీయ పార్టీల వద్ద ఉన్న వేలాది కోట్ల రూపాయలకు లెక్కా పత్రం లేకపోవడం గమనించాల్సిన అంశం. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు? అన్నది కూడా తెలియకపోవడం ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 3,377 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. ఈ సొమ్ము ఎవరు ఇచ్చారు? అనే ఆధారాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో ఇది దాదాపు 70 శాతంగా ఉందని అంచనా. అంటే.. కేవలం 30 శాతం విరాళాలలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయి. అంటే.. ఇవి మాత్రమే వైట్ మనీగా భావిస్తున్నారు పరిశీలకులు. మిగిలిన డెబ్బై శాతం సొమ్ము వివరాలు లేవంటే.. ఇదంతా బ్లాక్ మనీ అన్నట్టేగా అంటున్నారు. ఈ సొమ్ములో దాదాపు 75 శాతం ఒక్క బీజేపీకి మాత్రమే అందాయట. ఒక్క ఏడాదిలోనే 2,642 కోట్ల రూపాయలు బీజేపీకి అందాయని వార్తలు వస్తున్నాయి.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు గతంలో కేంద్రం ఎలక్టోరల్ బాండ్లను తెచ్చింది. ఈ బాండ్లను కొనుగోలు చేసేవారు వారి వివరాలు చెప్పాల్సిన పనిలేదు. దీంతో.. రాజకీయ పార్టీలకు భారీగా డబ్బులు ఎవరు ఇస్తున్నారో బయటకు తెలియట్లేదు. ఇలాంటి సొమ్మంతా బ్లాక్ మనీగానే పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
విరాళం ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పొద్దంటున్నాడంటే.. అతను దొడ్డిదారిన సంపాదించినట్టే కదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి వ్యక్తి, సంస్థ ఒక రాజకీయ పార్టీకి భారీగా కోట్లు విరాళం పేరుతో ఇస్తున్నారంటే.. అధికారంలోకి వచ్చినప్పుడు తమ అక్రమాన్ని చూసీ చూడనట్టు ఉండాలని కోరుతున్నట్టేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విరాళం ఇచ్చిన వారి వివరాలు తెలియకుండా ఉంచుతున్నారంటే.. రాజకీయ పార్టీలు కూడా ఆ పనికి తల ఊపినట్టేనా? అనే సందేహం కలగకమానదు. మరి, దీనిపై రాజకీయ పార్టీల నేతలు ఏమంటారో?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Political parties are receiving donations from unknown people and organisations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com