YSR Congress Alliance: విపక్షాల పొత్తులపై అధికార వైసీపీకి భయం పట్టకుంది. అందుకే ఇంకా పొత్తు పొడవక ముందే.. విపక్షాల మధ్య చర్చలు జరగకుండానే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. వారి పొత్తు అనైతికం, అసహజం అంటూ ప్రేలాపనలు చేస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికలన్నాక పొత్తులు సహజం. సైద్ధాంతిక విభేదాలున్న చాలా పార్టీలు కలిసి పనిచేశాయి. ప్రభుత్వాలు నడిపాయి. ఇప్పటికీ నడుపుతున్నాయి. విభిన్న భావజాలాలు కలిగిన పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. కానీ ఇంకా పురుడు పోసుకోని పొత్తుల గురించి వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా తమకు భయం లేదంటూనే భయపడేలా మాట్లాడుతున్నారు. దీనిని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతుండగా.. ప్రజల్లో కూడా వైసీపీ నేతల తీరుపై అనుమానాలు పెరిగిపోయాయి. ఒకవేళ టీడీపీ,జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ఓటమి ఖాయమన్న రేంజ్ లో వైసీపీ నేతల హావాభావాలు కనిపిస్తున్నాయి. వైసీపీ వ్యతిరేక ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి లైన్ లోకి వచ్చారు. గతంలో తాను వ్యాఖ్యనించిన వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు. తన మాట మార్చారు.
భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో పొత్తులు ఉండకూడదని కాదు. ఉంటాయి. అయితే అవి రెండు కులాల బేస్ మీదనో, రెండు వర్గాల బేస్ మీదనో లేదా ఎన్నికల ముందు కలవడం ఎప్పటికీ మంచిది కాదని 1990ల్లో వచ్చిన ఫ్రంట్‌లతో తేలిపోయింది’ అని అన్నారు. టీడీపీ, జనసేనలకు ఒకేరకమైన పాలసీలు, సిద్ధాంతాలు ఉన్నాయా అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
Also Read: Alliance Politics In AP: ఏపీలో పొత్తు రాజకీయం.. బీజేపీ లెక్కేమిటి?
అసలు పొత్తులు లేకపోవడమే వైసీపీ బలహీనత అన్నట్లుగా రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒకవేళ తనకు సీఎం పదవి వస్తే త్యాగం చేసి పవన్ కల్యాణ్‌కు ఆ పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. వారిలో వారికే స్పష్టత లేదన్నారు. పొత్తుల విషయంలో చంద్రబాబు అడ్డగోలుగా ఎన్నిసార్లు జంప్‌లు చేశారో అందరికీ తెలుసునన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని పవన్ చెబుతున్నారని.. పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దానికి సారుప్యత ఉందా అని ప్రశ్నించారు.
చంద్రబాబు కోసమే పవన్..
పగటి కలలు కంటూ ఊహాలోకంలో ఉన్నారని సజ్జల ఎద్దేవా చేశారు. . చంద్రబాబు స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని విమర్శించారు. పొత్తులపై అందరూ కలిసి జనాన్ని ఫూల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబును తిరిగి అధికారంలో ఎలా కూర్చోబెట్టాలనేదే పవన్ ఏకైక కార్యక్రమమని చెప్పారు. ఆ ప్రణాళికలో భాగంగానే వీరంతా మాట్లాడుతున్నారు. పవన్ గత ఎన్నికల్లో డమ్మీలను పెట్టి తెలుగుదేశానికి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. . ఏదో విధంగా జగన్‌ను గద్దె దింపాలనేదే వీరి లక్ష్యం. జనసేనకు ఓ విధానమంటూ లేదు’ అని ధ్వజమెత్తారు. పొత్తులపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ఇంధన, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారా.. లేక బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
Also Read:Sri Lanka Crisis: శ్రీలంకలో ఆరని ఆగ్రహజ్వాలలు.. రాజపక్స మద్దతు దారుల దాడులతో రెచ్చిపోయిన జనం