YCP Leader Kondareddy Arrested: వైఎస్..ఈ కుటుంబమంటేనే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. అటువంటిది ఆ కుటుంబానికి చెందిన వైఎస్ కొండారెడ్డి అనే వ్యక్తి కటకటలపాలు కావడం పెద్ద సంచలనమే రేకెత్తించింది. ఒక రోడ్డు కాంట్రాక్టర్ ను బెదిరించారన్న కారణంతో ఎస్పీ స్థాయి అధికారులతో అరెస్ట్ చేయించి జైలుకు పంపారు. అయితే ఇదంతా సీఎం జగన్ కు తెలిసే జరిగిందా అన్న అనుమానం సగటు మనిషిలో ఉంటుంది. కానీ దీని వెనుక కథ చాలా నడిచింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొండారెడ్డిని అరెస్ట్ చేయక తప్పలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారు.
ఇప్పటికే కొందరు ప్రభుత్వ భూములు ఆక్రమించేస్తుండగా, మరికొందరు సహజ వనరులు అయిన ఇసుక, మట్టిని దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు వారి అడ్డాలో అడుగు పెట్టాలన్నా, ఏ పనులు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే.. ఏ బిడ్డా.. ఇది నా అడ్డా అనేలా చెలరేగిపోతున్నారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో అయితే అది ఒక ప్రత్యేక రాజ్యం. అక్కడ వారు చెప్పిందే వేదం అంటుంటారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కేంద్ర పెద్దలు సైతం ప్రత్యేకంగా ద్రుష్టిసారించారు. సరిగ్గా అప్పుడే ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ ప్రతినిధులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కొండా రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ .. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత శ్రీరాములు వియ్యంకుడిది. దీంతో విషయం కేంద్ర పెద్దల వరకూ వెళ్లింది. వారి ఆదేశాల మేరకు హుటాహుటిన శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శంకర్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే పరిస్థితి తమదాకా వస్తుందనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. నేరుగా జిల్లా ఎస్పీ ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆయనే కొండా రెడ్డిని అరెస్ట్ చేశారంటే కేసు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Also Read: YSR Congress Alliance: పొత్తులపై మాట మార్చిన వైసీపీ
జరిగింది ఇది..
కర్నూలు జిల్లాలోని చాగలమర్రి నుంచి వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు, ఎర్రగుంట్ల, వీరపునాయునిపల్లె, వేంపల్లి, చక్రాయపేట మీదుగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వరకు రూ.350 కోట్లతో 143 కి.మీ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సంస్థ పనులు చేస్తోంది. వీరిని పర్సంటేజీ రూ.5కోట్లు ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంధువు, చక్రాయపేట వైసీపీ ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి బెదిరించారని సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీకి చెప్పడం కాదని.. స్థానికంగా తను చెప్పినట్టు వినాల్సిందేనని ఆయన హుకుం జారీ చేశారని అంటున్నారు.
ఈ వ్యవహారం బీజేపీ పెద్దల వరకూ వెళ్లడంతో ఇష్యూ సీరియస్ అయ్యింది. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట భౌగోళికంగా పెద్ద మండలమేమీ కాదు. వైసీపీ ఇన్చార్జి కారణంగా ఈ మండలానికి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ మండలానికి వైసీపీ ఇన్చార్జిగా వైఎస్ కొండారెడ్డి కొనసాగుతున్నారు. ఈ మండల పరిధిలోనే ఏ పని చేయాలన్నా ఈయన ఆశీస్సులు తీసుకోవాల్సిందే. అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అని సమాచారం. లేదంటే ఆ పనిని చేయనివ్వరని అంటున్నారు. అధికారులు సైతం ఆయనకు ఎదురు చెప్పరని సమాచారం. ప్రస్తుతం మండలంలో గ్రావెల్ రోడ్లు, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పనులన్నీ ఈయన అనుయాయులకే దక్కాయి. ఒక ఎత్తిపోతల పథకం, ఫోర్ లేన్ రోడ్డు పనులూ సాగుతున్నాయి.
కేంద్రం కన్నెర్ర
రాష్ట్రంలో అరాచక శక్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వం ద్రుష్టి పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే వైఎస్ జగన్ కుటుంబసభ్యుడు, విదేయుడైన కొండా రెడ్డిని అరెస్ట్ చేయించి గట్టి హెచ్చరికలే పంపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో బలవంతపు బదలాయింపులు అధికమయ్యాయి. అనంతపురం జిల్లాలో కాంట్రాక్ట్ సంస్థలపై దాడులు చేసిన దృశ్యాలు చాలా సార్లు బయటకు వచ్చాయి. ఇక బయటకు రాకుండా.. బెదిరింపులకు పాల్పడి.. వ్యాపార సంస్థల్ని కూడా లాగేసుకున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆటోమేటిక్‌గా చేతులు మారిపోయిన కొన్ని వందల వ్యాపార సంస్ధల యజమానులు ఎవరికీ తమ గోడు చెప్పుకోలేని పరిస్థితి. ఇటువంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా పెంచింది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ తీరుపై కూడా కేంద్ర నిఘా సంస్థలు ద్రుష్టిపెట్టాయి. అందుకే కొండా రెడ్డి అరెస్ట్ తో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు పోలీస్ వ్యవస్థకు సరికొత్త సవాల్ ఎదురైంది.
Also Read:Alliance Politics In AP: ఏపీలో పొత్తు రాజకీయం.. బీజేపీ లెక్కేమిటి?