Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వైసీపీ మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. రెండు పార్టీలు ప్రత్యేకంగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. విమర్శలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. జనసేనకు బీజేపీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నా ఎక్కడ కూడా బీజేపీ నేతలు బయటకు రావడం లేదు. పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణమురళి సైతం తనదైన శైలిలో విమర్శలు చేయడం తెలిసిందే. కానీ బీజేపీ నాయకులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇంతకీ బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందా లేక విడిపోయారా అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అయినా మిత్రపక్షం అని చెప్పుకుంటున్నా పెదవి మాత్రం విప్పకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
గతంలో కూడా బీజేపీ ఏ కార్యక్రమం నిర్వహించినా జనసేన హాజరు కాలేదు. జనసేన చేపట్టే ప్రోగ్రామ్ లకు బీజేపీ సైతం పాల్గొనలేదు. దీంతో ఇరు పార్టీల్లో అవగాహన ఉందో లేదో అనే సంశయాలు వస్తున్నాయి. రాష్ర్టంలో ఇంత జరుగుతున్నా బీజేపీ శ్రేణులు మాత్రం ఏ రకమైన ప్రకటనలు చేయడం లేదు. దీంతో బీజేపీ జనసేన పార్టీల మధ్య సఖ్యత ఉందా అని పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పే సోము వీర్రాజు కూడా పవన్ కల్యాణ్ పై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించలేదు. దీంతో బీజేపీకి జనసేన కంటే వైసీపీపైనే ప్రేమ ఉందన్నది తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో ఉన్న జీవీఎల్ నరసింహారావు కంటితుడుపు చర్యగా వైసీపీ నేతల చర్యలను ట్విటర్ వేదికగా ఖండించడం కొసమెరుపు. బీజేపీ, జనసేన నేతల మధ్య సయోధ్య కనిపించడం లేదు. ఇరు పార్టీల్లో అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.