Revanth Reddy: 2018, డిసెంబర్ 4న తెలంగాణ పోలీసులు రేవంత్‌రెడ్డి ఇంటికి తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లారు. ఇంటి తలపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్, గన్‌మెన్లను అరెస్ట్ చేశారు. కాలం గిర్రున తిరిగింది.. ఐదేళ్లు గడిచిపోయాయి.. 2023, డిసెంబర్ 5.. అదే పోలీసులు ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇంటికి వచ్చారు. అయితే ఈసారి అరెస్ట్ చేయడానికి కాదు.. ఫుల్ సెకూ‍్యరిటీ కల్పించేందుకు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎల్పీ నేతగా రేవంత్ ఎన్నికయ్యారు. రెండు రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటికి వెళ్లారు. కాబోయే సీఎం ఇల్లు కావడంతో భద్రతల కల్పించారు. నాటి పరిస్థితి, నేటి పరిస్థితిని చూసిన వారు.. ఐదేళ్లలో ఎంత మార్పు అని చర్చించుకుంటున్నారు. కష్టపడితే ఎంతటి లక్ష్యం అయినా చేరుకోవచ్చు అనడానికి రేవంత్ ఓ నిదర్శనమని సోషల్ మీడియాలో పోసు‍్టలు పెడుతున్నారు.
నాడు ఇలా..
2017 అక్టోబర్‌లో టీడీపీకి పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్‌రెడ్డి. 3 ఏళ్ల అనధికాలంలోనే ఎవ్వరికి దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించింది. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో పోటీ చేసి ఓడిపోయారు. నాడు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీలు పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ రెండు రోజుల కిందట రేవంత్‌రెడ్డి కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకోవాలని, కాంగ్రెస్ అభిమానులంతా బంద్‌లో పాల్గొనాలని ఆయన ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో ఆయన నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు.
నేడు ఇలా..
రేవంత్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా(టీపీసీసీ) 2021, జూన్ 26న కాంగ్రెస్ పార్టీ నియమించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. చివరికి 2023, డిసెంబర్ 3న తన లక్ష్యాన్ని చేరుకున్నారు. కేసీఆర్‌ని ఓడించి ముఖ్యమంత్రిగా ప్రమాణ బాధ్యతలు చేపట్టేస్థాయికి ఎదిగారు.