Congress Cabinet: తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రులు, మంత్రిత్వ శాఖలపై లోతైన చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఐటీ శాఖ మంత్రి ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో ఈ శాఖను కేటీఆర్ నిర్వహించడమే కారణం. ఐటీ శాఖను కేటీఆర్ అద్భుతంగా నిర్వహించారని.. ఐటీ కంపెనీల తేవడంలో కీలక పాత్ర పోషించారని.. అదే స్థాయిలో మంత్రి అవసరమని సోషల్ మీడియాలో కామెంట్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఐటీ శాఖ మంత్రిగా చేస్తుందోనన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఐటీ శాఖ కీలక కావడంతో రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. దేశంలో ఐటీ పరంగా తెలంగాణ ముందంజలో ఉండడంతో దానికి ప్రత్యేక మంత్రి ఉండాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే కేటీఆర్ కు మించి పనిచేస్తేనే ఆ శాఖకు గుర్తింపు ఉంటుందని.. ప్రభుత్వంలో కీలక నేతల వద్ద ఈ శాఖ ఉండడం శ్రేయస్కరం అన్న వాదన వినిపిస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి ఈ శాఖను తన వద్ద ఉంచుకుంటారన్న టాక్ నడుస్తోంది.
అయితే ఇప్పుడు ఐటి మంత్రిత్వ శాఖ విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల శ్రేణుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ సమర్థంగా విధులు నిర్వహించారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం ఆయన్నే ఐటీ మంత్రిగా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నాయి. కాంగ్రెస్ లో ఆ స్థాయి నాయకుడు భూతద్దంలో పెట్టి వెతికినా దొరకడని.. అందుకే మంత్రివర్గంలోకి కేటీఆర్ తీసుకోవాలని బీ ఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదే వేగంతో రిప్లై ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అంత కర్మ పట్టలేదని.. హైదరాబాదులో ఐటీ ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. కేటీఆర్ కు మించి సమర్థవంతంగా పనిచేసే నాయకులు కాంగ్రెస్లో ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు రిప్లై ఇస్తున్నారు. ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది.