పోలవరం ఏపీ ప్రజల చిరకాల స్వప్నం. ఎన్నో అవాంతరాల తర్వాత ఈ ప్రాజెక్టు మొదలైంది. కేంద్రం విభజన చట్టంలోనూ చేర్చింది. జాతీయప్రాజెక్టుగా ప్రకటించి, నిధులు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. యాభై వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడంతో.. ఖజానాకు భారమవుతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. ఎత్తు తగ్గింపు అనివార్యమని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనికి ఓకే చెబుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి.
Also Read: కేసీఆర్ రంగంలోకి.. ఏం జరుగనుంది?
పోలవరం ఎత్తు తగ్గింపు ప్రతిపాదనపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు స్పష్టమైన ప్రతిపాదనలు అందాయని మీడియాకు లీకులు అందాయి. మరి, ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా.. ఇంకెవరు పంపిస్తారు? అనే చర్చ మొదలైంది. అయితే.. వాస్తవానికి పోలవరం ఎత్తు తగ్గించాలంటే డిజైన్లు మార్చాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డిజైన్లు మార్చడం అసాధ్యం. అందుకే.. నీటి నిల్వ నిర్ణయాలతోనే.. ఎత్తు తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం.
పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 150 అడుగులు. కనీస నీటిమట్టం 135 అడుగులు. కనీస నీటి మట్టంలో నీటిని నిల్వ ఉంచితే.. 1,36,500 ఎకరాలు నీట మునుగుతాయి. వీటికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అంతేకాదు.. లక్షకుపైగా కుటుంబాలు నిర్వాసితులవుతాయి. అదే సందర్భంలో ప్రాజెక్ట్ వ్యయం రూ.యాభై వేల కోట్లవుతుంది. కాబట్టి.. కనీస నీటి మట్టాన్ని మూడు మీటర్ల మేర తగ్గిస్తే చాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. దీనివల్ల భూసేకరణ వ్యయం సగానికి సగం తగ్గిపోవడమే కాకుండా.. పునరావాస ప్యాకేజీ ఖర్చు కూడా తగ్గిపోతుందని సూచిస్తున్నారు.
Also Read: ప్రచారం కన్నా పనులే ముఖ్యం : పబ్లిసిటీని ఇష్టపడని జగన్
పోలవరం ఎత్తు తగ్గించబోతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పడం గమనార్హం. కేంద్రం పోలవరం అంచనా వ్యయం తగ్గించినప్పుడు.. ఏపీసర్కార్ కూడా ఇదే ఆలోచన చేసిందని ప్రచారం జరిగింది. కానీ.. జగన్ ప్రభుత్వం మాత్రం అదేం లేదని చెప్పింది. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే.. పోలవరం ఎత్తు తగ్గిస్తే.. రాయలసీమకు నీళ్లు అందవన్న ఆందోళన అక్కడి నేతల్లో వ్యక్తమవుతోంది. మరి, ఏం జరగబోతోంది? ప‌్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నాయి? అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్