
పోలవరం విషయంలో కేంద్రం సూచించిన ప్రకారం ఏపీ సర్కార్ పనులు చేపట్టింది. కానీ నెపాన్ని మాత్రం జగన్ సర్కార్ పై వేసి ఇప్పుడు చంద్రబాబు అండ్ కో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. జగన్ సర్కార్ సదురు పోలవరం కాంట్రాక్ట్ సంస్థకు దోచిపెడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజమెంత? అసలు వెనుకాల ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది.
చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్ కే పరిమితమైన పోలవరం పనులు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం అంచనాలను భారీగా పెంచి అవినీతి పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ కు లబ్ది చేకూర్చడానికి అదనంగా పెంచారని కొద్దిరోజులుగా టీడీపీ మీడియా, చంద్రబాబు, టీడీపీ నేతలు ఊదరగొడుతున్నారు.
నిజానికి గత పనులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ లో అదనపు పనులను ఇటీవలే కేంద్ర జలసంఘం సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది. అందుకు అనుగుణంగా రూ.683 కోట్ల పనులకు జగన్ సర్కార్ ఇటీవల జ్యూడిషియల్ అప్రూవల్ తీసుకుని టెండర్లను పిలిచింది. ఐతే ఇటీవల డిడిఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రతకోసం మరి కొన్ని కొత్త డిజైన్లు సూచించారు.. దీని ప్రకారం పాత అగ్రిమెంట్ కు అదనంగా కొత్త పనులు జత అవ్వడంతో ప్రాజెక్టు అంచనాలు కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీ సూచనలకు అనుగుణంగానే.. వీటిని అదనంగా చేర్చారు.
పోలవరంలో పనులన్నీ కేంద్రజలసంఘం సూచనల మేరకు 211.12కోట్లతో కొత్తగా టెండర్ పిలిచారు. ఇదంతా పారదర్శకంగానే జరిగింది. కేంద్రజలసంఘం నిపుణుల సూచనలకు అనుగుణంగా 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించారు.. ఈ పనులకు సైతం 242.87 కోట్లతో టెండర్ పిలిచారు. ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని సూచించారు. దీని కోసం 11.64 కోట్లతో టెండర్లు పిలిచారు.
స్పిల్ వే బ్రిడ్జికి కుడి, ఎడమ పక్కన ఉన్న కొండలకు రక్షణ చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా వర్షాలకు కొండ చర్యలు విరిగి పడిపోకుండా గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు, కేంద్రజలసంఘం సూచనల మేరకు 134.21 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు.. ఈ పనులన్నీ కూడా హెడ్ వర్క్స్ లో భాగంగా కేంద్ర జలసంఘం ఇటీవల అదనంగా సూచించడంతో అదనంగా 683 కోట్ల రూపాయల ఖర్చుఅవుతుందని అంచనాతో ఇటీవలే జ్యూడీషియల్ ప్రివ్యూ పూర్తి అయిన తరువాత టెండర్లు ఆహ్వానించారు. వీటితో పాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలను కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.
అయితే టీడీపీ మాత్రం జగన్ సర్కార్ అంచనాలు పెంచేసిందని నానా యాగీ చేస్తోంది. ఇది కేంద్రం చేసిన సవరణలు అయినా కూడా జగన్ నే టార్గెట్ చేస్తోంది. క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వంకు వెళ్ళిపోతుందనే అక్కసుతో పచ్చపార్టీ నేతలు ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.