Pocharam Srinivas Reddy: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లుగా పనిచేసిన వారు ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ సభలోకి రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సంప్రదాయాన్ని తెలుగు ఓటర్లు కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగింది. పాతికేళ్లుగా స్పీకర్లుగా పని చేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. దీంతో అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తే ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. దీంతో స్పీకర్ పదవిని చేపట్టాలంటే వెనుకంజ వేస్తున్నారు. నాటి స్పీకర్ కావలి ప్రతిభా భారతి నుంచి మొన్నటి కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి దాకా అందరూ ఓటమి పాలయ్యారు.
1999 నుంచి సెంటిమెంట్
1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. స్పీకర్ ఓటమి సెంటిమెంట్‌ను ఏ ఒక్కరూ బ్రేక్ చేయలేకపోయారు. 1999లో తెలుగుదేశం పార్టీ హయాంలో పని చేసిన కావలి ప్రతిభా భారతి, 2004–2009 వరకు కాంగ్రెస్ హయాంలో స్పీకర్‌గా పని చేసిన కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి, 2009–2010 వరకు పని చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి పాలయ్యారు. కిరణ్ కుమార్ స్పీకర్‌గా పని చేసి…ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 నుంచి 2014 వరకు స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్ మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు.
ఏపీలో కోడెల.. తెలంగాణలో మధుసూదనాచారి
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాద్ రావు విభజిత ఏపీకి తొలి స్పీకర్‌గా పని చేశారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఆయన అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటు తెలంగాణలో భూపాలపల్లి నుంచి బీఆర్‌ఎస్ తరపున గెలిచిన మధుసూదనాచారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ తొలి స్పీకర్ ఆయన. సెంటిమెంట్ కొనసాగుతూ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 నుంచి ఇప్పటి వరకు స్పీకర్‌గా పని చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నుంచి బరిలోకి దిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం 2004 మినహా 1999, 2009, 2011 ఉపఎన్నికతోపాటు 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు.
సెంటిమెంట్ తిరగరాస్తారా ?
స్పీకర్ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఈ సెంటిమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనాచారికి బీఆర్‌ఎస్ పార్టీ కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. అయితే స్పీకర్ల సెంటిమెంట్‌ను పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధిగమిస్తారని ఆయన అనుచరులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది డిసెంబర్ 3న తేలిపోతుంది.