షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ తోపాటు జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లతో భేటీ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే చివరిక్షణంలో ఈ భేటీ రద్దయినట్లు తెలిసింది. దీంతో ఎందుకు రద్దు చేశారనేదానిపై కూడా స్పష్టత లేదు.
కేంద్ర కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని మోడీ, అమిత్ షా, సంతోష్ సుదీర్ఘంగా చర్చలు జరపడంతో దీనికి బలం చేకూరింది. అయితే అర్థంతరంగా సమావేశం రద్దు కావడంతో విస్తరణపై అంచనాలన్ని తలకిందులయ్యాయి. అయితే అనధికార సమాచారం ప్రకారం ఈనెల 7,8 తేదీల్లో విస్తరణ ఉండవచ్చని రాజకీయ వర్గాల అంచనా.
కేంద్ర మంత్రివర్గంలో 81 మంది వరకు మంత్రులు ఉండొచ్చు. కానీ ప్రస్తుతం కేబినెట్ లో 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ, ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగరవేసిన పశుపతి పరాన్ తదితరులు కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావిస్తున్నారు.