ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అనే చందంగానే తయారవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైన తర్వాత మొదలు.. ఇప్పటి వరకు ఆ పార్టీకి ఊరటనిచ్చే సందర్భం ఒక్కటి కూడా రాలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు ఎన్నికల్లో వరుస దెబ్బలు తగులుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిర్మించడంలోనూ అధిష్టానం విఫలమవుతోంది.
జగన్ పాలన దాదాపుగా సగం పూర్తికావస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదనే చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం సంక్షేమం. జనం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన జగన్.. వాటి ఫలాలు కూడా నేరుగా అందేలా చేశారు. అదే సమయంలో.. ఎక్కడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విధంగా గడిచిన రెండేళ్లలో ఏకంగా.. ఒక లక్షా 116 కోట్లను ప్రజలకు నేరుగా అందించారు. వివిధ పథకాల కింద ఈ డబ్బును వారి అకౌంట్లలో జమచేశారు. ఇలా ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్య 6 కోట్లా 53 లక్షల, 12 వేల 534.
ఇంత పెద్ద మొత్తంలో.. ఏ రాష్ట్రంలోనూ లబ్ధిదారులకు డబ్బులు అందలేదు. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కనపెడితే.. గత ప్రభుత్వంతో జనాలు పోల్చి చూసుకోవడం సహజం. ఇలా చూసుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో పెద్దగా నగదు బదిలీ జరిగింది లేదు. ఏదో.. ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు కుంకమ పథకం కింద ఇచ్చిన నగదు తప్ప మరేదీ లేనట్టే. దాన్ని కూడా ఎన్నికల స్టంట్ గానే పరిగణించారు జనం. ఇక, రైతు రుణమాఫీ పథకం దారుణంగా విఫలమైంది.
ఇలా చూసుకున్నప్పుడు.. చంద్రబాబులో మైనస్ లు, జగన్లో ప్లస్సులు కనిపిస్తున్నాయి జనానికి! కానీ.. ఈ పరిస్థితి విపక్షానికి చాలా ఇబ్బంది కదా.. అందుకే ఏదో విధంగా జగన్ పై విమర్శలు గుప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. కరోనా నియంత్రణలో విఫలమయ్యారని తిట్టినా.. జనాలు పట్టించుకోలేదు. ఇది కేంద్రం అకౌంట్లోకి వెళ్లిపోయింది. ఇతరత్రా విషయాలపై మాట్లాడుతూ.. విమర్శలు గుప్పిస్తున్నా.. అవి టీడీపీకి మేలు చేసేవిగా లేవు. అటు అధిష్టానానికి ఇబ్బంది కలిగించేలా లేవు.
ఈ విధంగా.. జగన్ సర్కారుపై పోరాటం చేయడానికి చంద్రబాబుకు సరైన కారణమే కనిపించట్లేదట! ఈ కారణంగానే.. రఘురామ లాంటి వైసీపీలోని లుకలుకలపైనా ఆశలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా ఎంతగా ప్రచారం చేసినా.. వారు ఆశించిన లక్ష్యం మాత్రం నెరవేరట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, 40 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ వాడి.. జగన్ పై చంద్రబాఆబు ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారో చూడాలి.