PM Modi Visakha Tour: ‘పిల్లి గుడ్డిదైతే..ఎలుక ప్రతాపం చూపిస్తుంది’ అన్నట్టుంది ఏపీ దుస్థితి. దేశంలో అత్యంత దగా పడ్డ రాష్ట్రం ఏపీ. అన్యాయమైపోయిన రాష్ట్రం ఏపీ. మాటలతో నట్టేట ముంచబడిన రాష్ట్రం ఏపీ. జాతీయ పార్టీల ప్రయోగశాలగా మారిన రాష్ట్రం కూడా మనదే. కానీ ఎవరు ప్రశ్నించరు. పైగా మీరు ప్రశ్నించండంటే మీరు ప్రశ్నించండని సవాళ్లు.. ప్రతిసవాళ్లు. అధికార పక్షం, విపక్షం, చివరకు ప్రజలు కూడా ప్రశ్నించడం మానేస్తున్నారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకని.. కేంద్ర పెద్దలు కూడా లైట్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అన్న మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. అందుకే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా ఒక్కరంటే ఒక్కరు నోరు తెరవడం లేదు. ‘ప్రశ్నించలేని ప్రజలు, ప్రతిపక్షాల, ప్రజాసంఘాలు ప్రజాస్వామ్యానికి హానికరం’ అని పెద్దలు ఏనాడో సెలవిచ్చారు. ఇప్పుడది ఏపీలో ఫరిడవిల్లుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు జన్తా నై.. పొలిటికల్ గా ప్లస్ అవుతుందా? లేదా? అనేదే చూస్తున్నాయి ఏపీలోని రాజకీయ పక్షాలు. ఇంతలా సహకరిస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మాకేందుకంత ఆత్రం అన్నట్టు కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్నారు. పైగా మేము ఈ దేశానికి పాలకులం కానీ.. ఏపీకి ప్రత్యేకంగా కాదు కదా అని భావిస్తున్నారు.

ఏపీ పొలిటిక్స్ చీప్ ట్రిక్స్ గా నే మిగిలిపోతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ముక్కున వేలేసుకున్నంతగా ఇక్కడి రాజకీయాలు దిగజారిపోయాయి. ప్రధాని హోదాలో మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. రూ.15 వేల కోట్లతో అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలేవైనా ఉన్నాయంటే మాత్రం లేదని సమాధానం వినిపిస్తోంది. అవన్నీ విశాల భారత ప్రయోజనాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులే. కానీ మన రాష్ట్రానికి ఏమిటి? అన్న ప్రశ్న అధికార పక్షం, విపక్షం, చివరకు ప్రజల నుంచి కూడా రావడం లేదు. కానీ ప్రధాని పర్యటనకు అధికార వైసీపీ స్థాయికి మించి వ్యవహరిస్తోంది. తమ సొంత పార్టీ కార్యక్రమం అన్నట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతోంది. సాగర నగరంలో తోరణాలు, ఫ్లెక్సీలతో నింపేసింది.అంతవరకూ బాగానే ఉంది కానీ.. ప్రజలు, ప్రధాని సమక్షంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గొంతు ఎత్తే సాహసం రాష్ట్ర పాలక పక్షం చేయగలదా? అంటే లేదు అనే సమాధానమే వస్తోంది.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నడి వీధిలో నిలబడింది. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయింది. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు లేవు. మౌలిక వసతులు లేవు. రైల్వే ప్రాజెక్టులు, ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటన లేదు. ఎయిర్ పోర్టులు నిర్మాణాలు లేవు.విభజన హామీల్లో భాగంగా ఏ సంస్థలూ ఏర్పాటుకావడం లేదు. కనీసం ఏపీకి ప్రత్యేక ప్రాతినిధ్యమంటూ ఏమీ లేదు. అటు ప్రత్యేక హోదాకు అతీగతీ లేదు. 2014లో హామీ ఇచ్చారు. అటు తరువాత మరిచిపోయారు. హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. దానికి కూడా చాప చుట్టేశారు. అయినా తమకు అప్పులు ఇప్పిస్తే చాలూ అన్న దీన స్థితికి ఏపీ సర్కారు వచ్చేసింది. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా ఏర్పాటైంది విశాఖ స్టీల్ ప్లాంట్. కేంద్రం ప్రైవేటుపరం చేయాలని చూస్తే వ్యతిరేకించే పార్టీలు లేవు. స్థానిక ఉద్యమాలకు మద్దతు తెలుపుతున్నా.. బాహటంగా ప్రశ్నించే ధైర్యం అధికార, విపక్షాలకు లేకుండా పోయింది.

ప్రధాని విశాఖ పర్యటన ఏర్పాట్లు, అధికార పార్టీ హడావుడి చూస్తుంటే బీజేపీలో వైసీపీని విలీనం చేశారా? లేక బీజేపీ బాధ్యతలను వైసీపీకి అప్పగించారా? అని సగటు మనిషికి అనుమానం కలగక మానదు. రాష్ట్ర ఖజానా నుంచి నిధులు తీసి మరీ ప్రధాని పర్యటనకు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రధాని నుంచి భారీ వరాలు ఆశించి చేస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు. మొన్నటి వరకూ ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటిస్తారని ఊరూ వాడా ప్రచారం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని సైతం లీకులిచ్చారు. అటువంటిదేమీ లేదు కేవలం విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకేనంటూ పీఎం కార్యాలయం నుంచి షెడ్యూల్ వెలువడడంతో ఇదంతా రాజకీయ డ్రామాలుగా తేలిపోయింది. ఏపీ పాలకులపై కేసులు, విపక్షాలతో బీజేపీ కలవకుండా నియంత్రించడానికే విశాఖ హడావుడి అంటూ సామాన్య ప్రజలు సైతం నిర్థారణకు వచ్చారు. అటు విపక్షాలు ఎలాగూ భయపడుతున్నాయి. కానీ ప్రజలు సైతం లైట్ తీసుకునేటంతగా..వారిని మత్తులో పెట్టడంలో మాత్రం ఏపీ నాట పొలిటికల్ పార్టీలు సక్సెస్ అయ్యాయి.