New Delhi: ఉక్రెయిన్.. రెండేళ్ల క్రితం వరకు చాలా మంది భారతీయులకు తెలియదు యూరోపియన్ దేశమైన ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన అనేక మంది వైద్య విద్య కోసం వెళ్లేవారు. ఇక సన్ ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో ఉక్రెయిన్‌కు మంచి గుర్తింపు ఉంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే జరిగేది. అయితే రష్యా పొరుగునే ఉన్న ఉక్రెయిన్‌తో అగ్రరాజ్యం అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అమెరికా కూడా ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా సాయం చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వాలని అమెరికా భావించింది. దీనిని రష్యా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టింది రష్యా. రష్యా సైనిక దాడులను అమెరికా, బ్రిటన్ సహాయంతో ఉక్రెయిన్ తిప్పు కొడుతోంది. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. అయినా ఉక్రెయిన్ వెనక్కు తగ్గడం లేదు. మరోవైపు రష్యా సైనిక చర్యలు ఆపడం లేదు. 10 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా వద్ద బంధీలుగా ఉన్నారు. వారి సమాచారం తెలియక ఉక్రెయిన్‌లోని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నెల క్రితం రష్యా వెళ్లొచ్చిన మోదీ.. తర్వాత పర్యటనే ఉక్రెయిన్‌కు వెళ్లడం ఉప్పడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మోదీ ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశం అవుతారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ వెళ్లడం ఇదే తొలిసారి.
ఇటలీలో సమావేశం..
ఇదిలా ఉంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత జెలెన్స్కీ ప్రధాని మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సుకు వెళ్లారు. జీ7 దేశాల్లో సభ్యత్వం లేకపోయినా.. ఇటలీ ప్రధాని విన్నపం మేరకు వెళ్లారు. అక్కడ జీ7 దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ సదస్సుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా హాజరయ్యారు. ఇక్కడ మోదీని ప్రత్యేకంగా కలిసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒకసారి ఉక్రెయిన్ రావాలని కోరాడు.ఆ తర్వాత ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం కోసం రష్యా వెళ్లాడు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు మోదీ వెళ్లడాన్ని జెలెన్స్కీ తప్పు పట్టారు. రష్యా పర్యటనలో మోదీ, పుతిన్ ఆలింగనంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
యుద్ధం ఆపేందుకేనా..
గతనెలలో రష్యాలో పర్యటించిన మోదీ.. ఆదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ పర్యటన జరిగిన కొద్ది రోజులకే మోదీ ఉక్రెయిన్ పర్యటన ఫిక్స్ కావడం ఆసక్తి రేపుతోంది. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, యుద్ధాన్ని ఆపేందుకే మోదీ ఉక్రెయిన్ వెళ్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇటలీలో జెలెన్స్కీ కి ఇచ్చి మాటర మేరకే మోదీ ఉక్రెయిన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెక్‌లోని సమర్‌కండ్ నగరంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో యుద్ధం ఆపాలని ప్రధాని నరేంద్రమోదీ పుతిన్‌కు సూచించారు. రష్యా నాయకుడు ఉక్రెయిన్ వివాదాన్ని ముగించాలని కోరారు. మోదీ నిర్ణయం ప్రపంచ నాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే దీనిని పరిష్కరించగలమని భారతదేశం మొదటి నుంచి చెబుతోంది. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెల క్రితం మోదీ రష్యా వెళ్లడం.. ఆ తర్వాత ఆగస్టు 23న ఉక్రెయిన్ వెళ్తుండడంతో యుద్ధం ఆపేందుకు మోదీ చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 24వ తేదీ ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.