
దేశంలో కరోనా దారుణ ఫలితాలను నమోదు చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ మొదటి దశను దేశం సమర్థవంతంగా ఎదుర్కొందన్న ప్రధాని.. సెకండ్ వేవ్ మాత్రం విధ్వంసానికి దారితీసిందని చెప్పారు. లక్షలాది మంది ఆప్తులను కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఈ దశను సైతం ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా.. పలువురు వైద్యులు, బాధితులతో మోడీ సంభాషించారు. వారి అనుభవాలను తెలుసుకున్నారు. మహారాష్ట్ర డాక్టర్ శశాంక్, శ్రీనగర్ వైద్యుడు నవీద్ తో మాట్లాడారు. శశాంక్ మాట్లాడుతూ.. కొవిడ్ సోకితే ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చెప్పారు. జ్వరం తగ్గడానికి పారసిటమాల్ టాబ్లెట్ వాడాలని చెప్పారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు తరచూ ఫోన్ ద్వారా డాక్టర్లతో మాట్లాడుతుండాలని చెప్పారు. వారి సూచనలను పాటించాలని చెప్పారు.
మరోవైద్యుడు నవీద్ మాట్లాడుతూ.. పేషెంట్లు టెన్షన్ పడొద్దని చెప్పారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న పేషెంట్లు పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. మిగిలిన వారు వ్యాక్సిన్లు వేసుకోవాలని, దుష్ప్రభావం ఉంటుందనే వార్తలు నమ్మొద్దని చెప్పారు.
వీరి తర్వాత రాయ్ పూర్ కు చెందిన భావన ధృవ్, బెంగళూరుకు చెందిన సురేఖ అనే నర్సులతోపాటు గుర్ గావ్ లో కొవిడ్ నుంచి కోలుకున్న ప్రీతి చతుర్వేది, అంబులెన్స్ డ్రైవర్ ప్రేమ్ వర్మతో మోడీ మాట్లాడారు. వారి అనుభవాలను తెలుసుకున్నారు. బ్రీతింగ్ వ్యాయామాలు, యోగా, పౌష్టికాహారం ద్వారా తాను కోలుకున్నట్టు ప్రీతి తెలిపారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. కొవిడ్ బారి నుంచి వేగంగా కోలుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజలకు భగవాన్ మహావీర్ జయంతి, బుద్ధ పౌర్ణమి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.