భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు. ఈ వజ్రోత్సవ కీలక ఘట్టంలో దేశ చరిత్రను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాణేనికి ఒకవైపు దేశంలో ఎన్నో అసమానతలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు అభివృద్ధి కూడా చాలా జరిగింది. దీనికి ఏ ఒక్కరో కారణం అని చెప్పడానికి లేదు. 1947లో దేశ బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం పాలన సాగిస్తున్న ఎన్డీయే వరకు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టీఆర్ఎస్, వైసీపీ దాకా.. అందరి సహకారమూ ఉంది. అయితే.. ఈ అద్వితీయ సందర్భాన ప్రసంగించిన అధినేతలు.. గతంలో పాలించిన వాళ్లు ఏమీ చేయలేదన్నట్టుగా.. మొత్తం తామే ఈ స్థితికి తెచ్చినట్టుగా మాట్లాడారు.
గడిచిన 75 వసంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రధాని మోడీ పెద్దగా ప్రస్తావించలేదు. మొత్తం ఎన్డీఏ హయాంలోనే జరిగిందనే రీతిలో ప్రసంగించారు. తాము చేసిన పని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ.. తాము చేసింది మాత్రమే గొప్పదని, ఇప్పటి వరకూ పరిపాలించిన వారెవ్వరూ ఏమీ చేయలేదు అన్నట్టుగా వ్యవహరించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వజ్రోత్సవ సంబరాల్లో ఇప్పటి వరకూ దేశం ఏం సాధించింది? ప్రధాన ఘట్టాలు ఏంటీ? అన్నది ప్రస్తావించి.. రేపటి రోజున ముందుకు సాగడానికి ఏం చేస్తున్నామో చెప్పాలి. కానీ.. కేవలం తమ పాలన పరంగా, తమ పార్టీ పరంగా చేసినవే గొప్ప విజయాలుగా చెప్పుకోవడానికే ప్రధాని ప్రయత్నించారనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఇటు రాష్ట్రంలోనూ ఇంతకు మించి ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాము ఏడేళ్లలో సాధించిన అభివృద్ధితోనే తెలంగాణ ఈ స్థితికి వచ్చిందన్నట్టుగా మాట్లాడేశారు. కానీ.. వాస్తవం వేరు. రాష్ట్ర విభజన సందర్భంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు టీఆర్ ఎస్ పార్టీ పాలన చేపట్టలేదు. అంటే.. మరి, అది ఎవరి వల్ల సాధ్యమైంది? అంటే.. నిస్సందేహంగా గత పాలకులు సాధించి పెట్టినదే. రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఈ ఏడేళ్లలో ఎదిగిందా? అంటే.. కాదని ఎవరైనా చెబుతారు. గతంలో పాలించిన వారు తలో చెయ్యి వేస్తేనే.. ఇంతగా ఎదిగింది. ఈ విషయాలన్నీ వదిలేసి, కేవలం తమ పాలనలోనే రాష్ట్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నట్టుగా మాట్లాడడం.. ఇతరులను పూచిక పుల్లలా తీసిపారేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఏపీ సీఎం జగన్ ప్రసంగం సైతం ఇంతకు భిన్నంగా ఏమీ సాగలేదు. ఆంధ్రప్రదేశ్ లో సాగిస్తున్న సంక్షేమం దేశానికి ఆదర్శం అంటూ మొదలు పెట్టిన జగన్.. తాము ప్రవేశపెట్టిన నవరత్నాలు, ఇతర పథకాల గురించి వివరించడానికే ప్రసంగంలో సింహభాగం టైమ్ కేటాయించారు. అదే సమయంలో అభివృద్ధి సంగతేంటీ? రేపటి రోజున రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అన్న విషయాల గురించి మాత్రం మాట్లాడలేదు. గత పాలకులను అంటే.. టీడీపీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు తప్ప.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తనకున్న విజన్ ఏంటన్నది మాత్రం వివరించలేదు.
ఈ విధంగా.. పాలకుల ప్రసంగంలో పదాలు మారాయే తప్ప.. అంతరార్థం మాత్రం మారలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అటు దేశంలోనైనా.. ఇటు రాష్ట్రంలోనైనా.. నేతలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా రాజకీయ వేదికగా మలుచుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ అద్వితీయ సందర్భాన.. భవిష్యత్ నిర్మాణానికి సంబంధించిన లక్ష్యాల గురించి కాకుండా.. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి వెళ్లిపోయారనే అభిప్రాయం వ్యక్తమైంది.