
ఆ మధ్య దంచికొట్టిన వాన.. తాజాగా ఇటీవల గెరువిచ్చింది. నిన్నటి నుంచి మళ్లీ వానలు మొదలయ్యాయి. దంచి కొడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇటు తెలంగాణలోనూ.. ఏపీలోనూ పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం.. ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది.
ఇక అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనావేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరకోస్తాలో అతి భారీ వర్షాలు పడుతాయని ప్రజలను హెచ్చరించింది. 50 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తెలంగాణకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది.
ఇక భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఏపీలో వర్షాల ప్రభావం ఉన్న చోట హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. అధికారులను సిద్ధంగా ఉంచారు. కలెక్టర్లు సమీక్షిస్తున్నారు.