PM Modi- Kuno National Park: ప్రధానమంత్రి మోడీ ఇవాళ 72వ వడిలోకి అడుగు పెడుతున్నారు. ప్రతిసారి తన జన్మదినోత్సవాన్ని ఆడంబరంగా జరుపుకునే మోది.. ఈసారి అందుకు భిన్నంగా ఆలోచించారు. గుజరాత్ లో తన తల్లి ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకుని.. నేరుగా మధ్యప్రదేశ్ లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లారు. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో చిరుతల సంబరానికి సర్వం సిద్ధమైంది. మళ్లీ వాటి అడుగు దేశంలో పడుతున్నది. ఆఫ్రికా ఖండం నమీబియా నుంచి 8 చిరుతలతో బయలుదేరిన ప్రత్యేక కార్గో విమానం పది గంటలు ప్రయాణించి శనివారం ఉదయం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు చేరుకుంది. అక్కడి నుంచి వాటిని కునో నేషనల్ పార్క్ కు చేరవేశారు. వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్కులోకి విడిచిపెట్టారు. ఈ కార్యక్రమం కోసం అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అటు కేంద్ర పర్యావరణ అటవీశాఖ అధికారులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోడీ రాక నేపథ్యంలో అధికారులు పార్కు పరిసరాలను అట్టహాసంగా తీర్చిదిద్దారు. చిరుతల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
చిరుతపులులు ఎందుకంటే
దేశంలో నానాటికి చిరుతల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ క్రమంలో దేశంలో వాటి సంతతి పెంచాలని కేంద్ర పర్యావరణ శాఖ యోచించింది. ఇందులో భాగంగానే ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలను దేశంలోకి తీసుకొచ్చారు. ఆడ చిరుతల వయసు రెండు నుంచి ఐదు ఏళ్ళు ఉంది. మగ చిరుతల వయసు 4.5 నుంచి 5.5 ఏళ్లు. వీటి తరలింపునకు నమిబియా కేంద్రంగా పనిచేస్తున్న చిరుతల సంరక్షణ సంస్థ సి సి ఎఫ్ భారతదేశానికి సహకరించింది. వాస్తవానికి చిరుతలను తీసుకొని వస్తున్న విమానం రాజస్థాన్లోని జైపూర్ కు శుక్రవారం చేరుకోవాలి.

అయితే చివరి నిమిషంలో ఈ రూట్ మ్యాప్ లో మార్పులు చేశారు. గ్వాలియర్ లోని మహారాజపుర ఎయిర్ బేస్ కు శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విమానం చేరుకుంది. అక్కడి నుంచి చినూక్ రకానికి చెందిన అతి భారీ వైమానిక హెలికాప్టర్లో చిరుతలను పార్కు వద్దకు తరలించారు. అక్కడ ప్రత్యేకమైన హెలిపాడ్ ను సిద్ధం చేశారు. అయితే ఈ చిరుతలను ఇండియాకు తీసుకురావాలనే ఆలోచన చేసింది తామేనని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే మీ పనులన్నీ ప్రకటనలకే పరిమితం అవుతాయని బిజెపి ఐటి సెల్ కౌంటర్ ఇచ్చింది. చిరుతలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా అని పలువురు పర్యావరణవేత్తలు ఇరు పార్టీలను కడిగిపారేస్తున్నాయి. మోడీ చిరుతల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవడాన్ని మధ్యప్రదేశ్ నేతలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. చిరుతల మధ్య 56 అంగుళాల పులి తన 72వ జన్మదిన జరుపుకుంటున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అవి ట్రెండింగ్లో ఉన్నాయి.