PM Modi: దేశంలో హర్యాన, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగాయి. బుధవారం(సెప్టెంబర్ 25న) రెండో విడత ఎన్నికలు జరిగాయి. ఇక హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. దీంతో పార్టీ తరఫున కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేలు మాత్రం మూడోసారి బీజేపీ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని రోహ్‌తక్–పానిపట్ హైవే బైపాస్ వెంట బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హర్యానాను మధ్యవర్తులు, అల్లుళ్లకు అప్పగించిందని ఆరోపించారు.
మళ్లీ బీజేపీ సర్కార్..
హర్యానాలో మరోమారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. జనం నాడి కూడా ఇదే అని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతోందని అన్నారు. బీజేపీకి ఆదరణ పెరుగుతోందని తెలిపారు. మరోసారి బీజేపీ సర్కార్ అని హర్యానా ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్పనిసరని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలోకి అవినీతిని తెచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. అవినీతికే కేరాఫ్ పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
వ్యవసాయం, పారిశ్రామికంగా టాప్..
ఇక గడిచిన పదేళ్లలో బీజేపీ హర్యానా రాష్ట్రాన్ని వ్యవసాయంలో, పారిశ్రామికంగా దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లిందని తెలిపారు. పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. హర్యానాను మెడల్ ఫ్యాక్టరీగా మోదీ అభివర్ణింవచారు. అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు మెడల్స్ సాధించడం ద్వారా దేశం గర్విస్తోందని తెలిపారు.