PM Modi Interview: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనలో ఎన్నడూ మీడియా సమావేశం పెట్టిన సందర్భం లేదు. ప్రజలకు ఏదైనా చెప్పాలంటే.. ఆయనే ఒంటరిగా, లైవ్ వీడియో ద్వారా సందేశం ఇస్తారు. కరోనా సమయంలో ఇది చూశాం. ఇక మన్‌కీ బాత్ ప్రోగ్రాం ద్వారా తాను చెప్పాలనుకున్నది చెబుతారు. అధికారిక కార్యక్రమాలు, సభల్లో ప్రసంగించి వెళ్లిపోతారు. కానీ, ఎక్కడా మీడియాతో మాట్లాడరు. ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వరు. పదేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు నాలుగైదుకు మించి లేవు. ఇక ఇంటర్వ్యూ చేసేవారిని కూడా ఆయనే ఎంపిక చేసుకుంటారు. వారికే అవకాశం ఇస్తారు. వారికి తప్ప ఇతర జర్నలిస్టులకు అవకాశం రావడం లేదు. ఇతరులతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మోదీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా తాను ఎంపిక చేసుకున్న ఏఎన్‌ఐ రిపోర్టర్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
75 నిమిషాల నిడివి..
ఇక మోదీ తాజా ఇంటర్వ్యూ 75 నిమిషాల నిడివితో ఉంది. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. సాధారణంగా జర్నలిస్టులకు ప్రశ్నించే అవకాశం వస్తే.. ప్రశ్నలు తన్నుకుంటూ వస్తాయి. ఇక పదేళ్లు అధికారంలో ఉన్న మోదీని అడగాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. గడిచిన 65 ఏళ్లలో ప్రధానులుగా పనిచేసిన వారంతా చేసిన అప్పు కంటే ఎక్కువ మోదీ చేశారు. అయితే అప్పు ఎందుకు చేశారని అడగడం కన్నా.. అంత భారీ మొత్తం ఎక్కడ వెచ్చించారు అనేది ప్రశ్న. ఇది ప్రతీ జర్నలిస్టుకు తెలుసు. కానీ మోదీ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న లేనే లేదు. అదే కాదు. మోదీని ఇబ్బంది పెట్టే ఏ ప్రశ్న ఇంటర్వ్యూలో అడగలేదు.
మోదీకి ఇబ్బంది కలుగని ప్రశ్నలు..
ప్రధాని మోదీకి కాసింత కూడా ఇబ్బంది కలుగకుండా, కాస్త నొప్పించే ప్రశ్నలు కూడా అడగకుండా.. మోదీ ఏం చెప్పాలనుకున్నారో దానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేసి సమాధానాలు చెప్పించడం ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత. ఈ ఇంటర్వ్యూ మొత్తం భజన ప్రోగ్రాం అని ఇట్టే అర్థమవుతుంది.
మోదీ సుడి అట్లుంది..
ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో తన ఆశల్ని.. ఆశయాల్ని.. కలల్ని మాత్రమే మోదీ వివరించారు. తన మీద వస్తున్న విమర్శలు, తన పాలనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి కనీసం మాట్లాడలేదు. జన్నలిస్టు కూడా సంధించలేదు. ఇదంతా చూస్తే మోదీ సుడి మామూలుగా లేదన్న భావన కలగక మానదు. మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలే అరుదు. ఇలా వచ్చిన అవకాశాన్ని మోదీ కోరుకున్న ప్రశ్నలు వేయడం కన్నా ఇంటర్వ్యూ చేయకపోవడమే మేలు కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.