Ananya Reddy UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్స్ ఫలితాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా చెందిన దోనూరు అనన్యా రెడ్డి సత్తా చాటారు. సివిల్స్ లో జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించారు. సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ జాతీయ స్థాయిలో మూడవ సాధించడం పట్ల ఆమె బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనన్యకు చిన్నప్పటినుంచే ఐఏఎస్ కావాలనే ఆశయం ఉండేది. దానికి అనుగుణంగానే ఆమె చదువు సాగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆమె బాల్యం గడిచింది. ఐఏఎస్ కావాలనే ఆమె కలలకు రెక్కలు తొడిగింది ఆమె తాతయ్య కృష్ణారెడ్డి. ఆయన సలహాలు, సూచనలతో అనన్య చిన్నప్పటినుంచే సివిల్స్ లక్ష్యంగా చదువుకుంది. ఎటువంటి శిక్షణ పొందకుండా మొదటి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో గొడవ సాధించింది.
ఇంటర్ నుంచి.
అనన్య ఒకటి నుంచి పది వరకు మహబూబ్ నగర్ లోని గీతం పాఠశాలలో చదువుకుంది. పదవ తరగతిలో అత్యుత్తమ గ్రేడింగ్ సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచే ఐఏఎస్ కావాలనే తన ఆశలకు రెక్కలు తొడిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాదులోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేర్పించారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులో చేరారు. డిగ్రీ పూర్తయిన అనంతరం 2020 నుంచి పూర్తిస్థాయిలో ఆమె సివిల్స్ ప్రిపరేషన్ పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో సివిల్స్ లో ఆప్షనల్ సబ్జెక్టులు గా ఆంత్రో పాలజీ ని ఎంచుకున్నారు. దానిపై పట్టు సాధించేందుకు అన్ లైన్ లో శిక్షణ తీసుకున్నారు. మిగతా సబ్జెక్టులను సొంతంగా ప్రిపేర్ అయ్యారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు ప్రిపరేషన్ సాగించారు.
సిద్ధమయ్యే క్రమంలో ..
సివిల్స్ కు సిద్ధమయ్యే క్రమంలో అనన్య రెడ్డి సొంత ప్రిపరేషన్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు చదువుకునేవారు. సబ్జెక్టుకు సంబంధించి ప్రతి అంశాన్ని నోటుగా రాసుకునేవారు. దీంతో ఆమె శిక్షణ తీసుకునే అవసరం లేకపోయింది. సులువుగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. దాని ప్రకారం నిర్దిష్ట సమయంలో సిలబస్ పూర్తి చేశారు. ఈ విధంగా ఆమె తన ప్రిపరేషన్ కొనసాగించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. డిగ్రీలో ఆర్ట్స్ చదవడం, పీజీ లోనూ ఆర్ట్స్ కు సంబంధించిన సబ్జెక్టులను ఎంచుకోవడంతో అనన్య రెడ్డికి సివిల్స్ ర్యాంక్ సాధించడం సులభం అయింది. పైగా ఆమె ఢిల్లీలో చదువుకోవడం కలిసి వచ్చింది. అక్కడ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కలవడం.. వారి సలహాలు తీసుకోవడం.. ఆ విధంగా ఆమె తన ప్రిపరేషన్ కొనసాగించారు. మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్ లోనే జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపిక అయ్యారు. ఆమె సివిల్స్ మూడో ర్యాంకు సాధించడం పట్ల స్వగ్రామం పొన్నకల్ లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అనన్య రెడ్డి తండ్రి సురేష్ రెడ్డి గ్రామంలో కొద్ది సంవత్సరాలపాటు వ్యవసాయం చేశారు. ఆ తర్వాత కుమార్తెల చదువు కోసం 20 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు.