ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో 370 స్థానాల్లో పార్టీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం(ఫిబ్రవరి 22న) తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుజరాత్‌లో బిజీ బిజీగా గడిపిన మోదీ రాత్రి వారణాసికి చేరుకున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శివపూర్–ఫుల్వారియా–లహర్తార రహదారిని పరిశీలించారు. ఇటీవలే ఈ రహదారిని ప్రారంభించారు.
5 లక్షల మందికి ప్రయోజనం..
విమానాశ్రయం, లక్నో అజంగఢ్, ఘజియాపూర్ వెళ్లాలనుకునే బీహెచ్‌యూ, బీఎల్‌డ్లూ్య మొదలైన దక్షిణ భాగంలో నివసిస్తున్న 5 లక్షల మందికి ఈ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. రూ.360 కోట్లతో ఈ రోడ్డు నిర్మించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా బీహెచ్‌యూ విమానాశ్రయానికి ప్రయాణ సమయం 75 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గించారు. లహర్తి నుంచి కచారి చేరుకునే సమయాన్ని కూడా 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించారు.
ట్విట్టర్‌లో మోదీ పోస్టు..
ఇక ఈ రహదారి గురించి ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘కాశీకి చేరుకున్నప్పుడు, (నేను) శివపూర్–ఫుల్వారియా–లహర్తారా రహదారిని పరిశీలించాను. ఈ ప్రాజెక్ట్ ఇటీవల ప్రారంభమైంది. వారణాసి దక్షిణ ప్రాంత ప్రజలకు ఈ రహదారి చాలా ఉపయోగకరంగా ఉంది’ అని పేర్కొన్నారు.
శుక్రవారం కూడా..
ఇక వారణాసి పర్యటనలో భాగంగా మోదీ శుక్రవారం(ఫిబ్రవరి 23న) పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని స్వంతత్ర భవన్‌లో పీఎం నాలెడ్జ్ పోటీ, ఎంపీ ఫొటోగ్రఫీ పోటీలు, ఎంపీ సంస్కృతం పోటీల్లో పాల్గొనేవారితో ప్రధాని ఇంట్రాక్షన్ అవుతారు. ఐదుగురు ప్రముఖులు కూడా మోదీని కలుస్తారని తెలుస్తోంది. ఉదయం 11:15 గంటలకు సెయింట్ గురు రవిదాస్ జన్మస్థలంలో పూజలు చేస్తారు. తర్వాత రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత కార్ఖియావ్ అమూల్ ప్లాంట్ కాంప్లెక్స్‌లో రూ.14 వేల కోట్లకుపైగా విలువైన 36 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కార్ఖియావ్ అమూల్ ప్లాంట్ కాంప్లెక్స్‌లో రూ.14 వేల కోట్లకు పైగా విలువైన 36 ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.