Super Star Family: అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ?

గుంటూరు ఎంపీగా రెండుసార్లు పదవి బాధ్యతలు చేపట్టిన గల్లా జయదేవ్.. కృష్ణ అల్లుడు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు.ఇప్పుడు కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది.

Written By: Dharma, Updated On : February 23, 2024 12:34 pm
Follow us on

Super Star Family: ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో దిగనుందా? ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అసెంబ్లీకి పోటీ చేయనున్నారా? ఆ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ అభిమాని. ఎన్టీఆర్ను వ్యతిరేకించి మరి ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. చనిపోయే వరకు వేరే పార్టీలో చేరలేదు. అయితే గుంటూరు ఎంపీగా రెండుసార్లు పదవి బాధ్యతలు చేపట్టిన గల్లా జయదేవ్.. కృష్ణ అల్లుడు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు.ఇప్పుడు కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది.

ప్రస్తుతం కృష్ణ సోదరుడు, మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. వైసిపి ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కృష్ణతో మంచి సంబంధాలు ఉండడంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆదిశేషగిరిరావు వైసీపీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. కానీ జగన్ నుంచి ఆ స్థాయిలో గుర్తింపు లభించకపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆదిశేషగిరిరావు సైలెంట్ అయ్యారు. అలాగని వేరే పార్టీలో చేరలేదు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండటంతో ఆదిశేషగిరిరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

గుంటూరు నుంచి రెండుసార్లు గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆస్థానం నుంచి ఆదిశేషగిరిరావును బరిలో దించితే ఎలా ఉంటుందోనని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సీటు పై కొందరు ఎన్నారైలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఆదిశేషగిరిరావుకు ప్రత్యామ్నాయంగా పెనమలూరు స్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ సీటును మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆశిస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరనున్నారు. అయితే పార్థసారథికి నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. దీంతో బోడె ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా పెనమలూరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో నుంచి ఆదిశేషగిరిరావుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆదిశేషగిరిరావు అయితే సరైన అభ్యర్థి అవుతారని టిడిపి వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మహేష్ బాబు మద్దతు తెలుగుదేశం పార్టీకి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.