టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కి ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన జన్మభూమి కమిటీలు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికీ తీసుకురానంత చెడ్డపేరును చంద్రబాబుకు తెచ్చిపెట్టాయి. ఓ రకంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల తరహాలోనే తెరపైకి వచ్చిన వాలంటీర్ల వ్యవస్ధకు అలాంటి చెడ్డపేరు రాకుండా చూడాలని భావిస్తోంది. ఈ పని ఎంత త్వరగా చేయగలిగితే 2024 ఎన్నికల్లో తమకు అంతగా ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. దీంతో ముందుగా ఏడాదిలో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుపై ఓ సమగ్ర సర్వే చేయించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే వాలంటీర్లపై వస్తున్న ఫిర్యాదులు, టీడీపీ ఈ వ్యవస్ధపై చేస్తున్న ఆరోపణలు, అక్కడక్కడా నమోదవుతున్న కేసులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఒకసారి గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుపై ప్రభుత్వానికి సమగ్రంగా సర్వే వివరాలు అందితే ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది. అప్పుడు అదే పీకే టీమ్ ను వాలంటీర్ల వ్యవస్ధ సమన్వయం చేయడంతో పాటు వాటి పనితీరుపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడం.. అంతిమంగా ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. సర్వే పూర్తయ్యాక వీటి ఫలితాల ఆధారంగా పీకే టీమ్ కు ఇవ్వాల్సిన బాధ్యతలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అప్పుడు వాలంటీర్ల వ్యవస్ధ మెరుగ్గా సేవలందించేందుకు థర్డ్ పార్టీ పేరుతో పీకే టీమ్ రంగంలోకి దిగి సమన్వయం చేస్తుంది. 2024 ఎన్నికల నాటికి వాలంటీర్ల వ్యవస్ధను ప్రజలకు పూర్తి స్ధాయిలో చేరువ చేసి ఇక జనానికి ప్రభుత్వ సేవలు అందించడంలో గ్యాప్ పూర్తిగా తొలగించాలనేది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.