సీఎం జగన్ కూడా ప్రధాని మోదీని ఫాలో అవుతున్నారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ ‘జనతా కర్ఫూ’ విధించిన సంగతి గుర్తిండే ఉంటుంది. మార్చి 22న ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కోరారు. అదే సమయంలో సాయంత్రం 5గంటలకు ప్రజలంతా బయటికొచ్చి కరోనాపై పోరాడుతున్న వైద్యుల సేవలకు సెల్యూట్ చేస్తూ చప్పట్లు కొట్టాలని పిలుపు నిచ్చారు. ఆ తర్వాత మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
మోదీ కోరినట్లుగానే ప్రజలంతా బయటికి వచ్చి చప్పళ్లు కొట్టారు. ఇక సెలబ్రెటీలైతే చప్పట్లతోపాటు గంటల కొట్టడం.. క్యాండిల్స్ వెలిగించడం వంటి హడావుడి చేశారు. దీని తర్వాత కరోనా వైరస్ భారత్ నుంచి వెళ్లిపోతుందని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా కేంద్రం లాక్డౌన్ విధించి అందరికీ షాకిచ్చింది. లాక్డౌన్ విధించిన తర్వాత కూడా కరోనా కేసులు విజృంభించడంతో ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తాయి. మోదీ చేపట్టిన చప్పట్ల కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఒక ఆటఆడేసుకుంటున్నాయి.
ఇక తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 7గంటలకు ఏపీలోని ప్రజలంతా బయటికి వచ్చి చప్పట్లు కొట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంగా సీఎం కూడా పాల్గొని చప్పట్లు కొడుతారని అధికారులు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. 4లక్షల మంది గ్రామ సేవకులతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు నేరుగా అందిస్తున్నారు. వలంటీర్ల పనితీరు వల్ల ప్రభుత్వానికి మంచిపేరు వస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం వలంటీర్ల సేవలను గుర్తించిం వారిని అభినందించే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే నేటి సాయంత్రం 7గంటలకు ప్రజలందరూ చప్పట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సీఎం జగన్ కోరుతున్నారు.
అయితే ఇటీవల కాలంలో వలంటీర్ల వ్యవస్థ పనితీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. వైసీపీ నేతలే వలంటీర్ల వ్యవస్థను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రజలతో కలిసి చప్పట్లు కొట్టి వలంటీర్లను అభినందించనుండటం ఆసక్తి రేపుతోంది. రానున్న రోజుల్లోనూ సీఎం జగన్ కు ఈ వలంటీర్ల వ్యవస్థ ఇలానే మంచిపేరు తీసుకొస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!