సంచలన టివి యాంకర్ గా పేరొందిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, ఆయన భార్యపై గత అర్ధరాత్రి ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెడుతుండగా, రాత్రి 12.15 గంటల ప్రాంతంలో, ఆయన ఇంటికి సుమారు 500 మీటర్ల ముందు ఈ దాడి జరిగింది.
గోస్వామి దంపతులకు గాయాలు కాలేదు. అర్నాబ్ గోస్వామి, ఆయన భార్య, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ సమియా రాయ్ గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా అర్నాబ్ విడుదల చేసిన వీడియోలో తనపై దాడి జరిపిన వారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలని అక్కడున్న భద్రతా సిబ్బంది తెలిపినట్లు ఆరోపించారు.
తనపై దాడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యత వహించాలి అంటూ ఆ వీడియోలో ఆమెపై తీవ్రమైన విమర్శలు జరిపారు. తనను నేరుగా ఎదుర్కోలేక ఇటువంటి పిరికి చర్యలకు ఆమె పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. తనకు ఏమి జరిగినా ఆమె బాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.
బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తమ పైకి ఏదో రసాయనాలు చల్లినట్టు ఆర్నాబ్ వాపోయాడు. గోస్వామి నిన్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ టివి లైవ్ డిబేట్ లో తన రాజీనామాప్రకటించి సంచలనం కలిగించారు.
మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి జరిపి హత్యా కావించిన సంఘటనపై జరిగిన టీవీ లైవ్ చర్చ సందర్భంగా మౌనంగా ఉన్న సోనియా గాంధీని ఆయన ప్రశ్నించారు.
“బహుశా మీరిప్పుడు సంతోషంగా ఉండి ఉండాలి. అదే మైనారిటీలకు చెందిన స్వాములపై, బిజెపి పాలిత రాష్ట్రాలలో దాడులు జరిగితే మీరు మౌనంగా ఉండేవారా?” అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఈ వాఖ్యలు కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇటువంటి వాఖ్యలు చేయడం అమర్యాదకరమని అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, ఇతర నేతలు అర్నాబ్ పై విమర్శల వర్షం కురిపించారు.
కాగా, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని చెబుతూ దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్ నిజం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఈ దాడిని ఖండిస్తూ, ఈ విషయంలో అర్నాబ్ కు సంఘీభావం ప్రకటించారు.