పెట్రో ధ‌ర‌ల సెంచ‌రీ.. గ‌త ప్ర‌భుత్వాల‌‌పై నె‌ట్టేసిన‌ మోడీ.. అందులో నిజ‌ముందా‌?

ఇప్పుడు దేశంలో తీవ్ర చ‌ర్చకు దారితీసిన‌ అంశాల్లో పెట్రోధ‌ర‌ల పెరుగుద‌ల ఒక‌టి. కొన్ని ప్రాంతాల్లో లీట‌రు పెట్రోల్ ధ‌ర‌ వంద రూపాయ‌లు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో వంద‌కు చేరువ‌లో ఉంది. గ‌త యూపీఏ హ‌యాం వ‌రకూ ధ‌ర‌ల నియంత్ర‌ణ కేంద్రం చేతుల్లోనే ఉండేది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ధ‌ర‌ల నిర్ణ‌యాధికారం ఆయిల్ కంపెనీల‌కే అప్ప‌గించింది. దీంతో.. అవి ఇష్టారీతిన పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఈ భారం దేశ ప్ర‌జ‌లంద‌రిపైనా ప‌డుతుండ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని […]

Written By: Bhaskar, Updated On : February 21, 2021 12:49 pm
Follow us on


ఇప్పుడు దేశంలో తీవ్ర చ‌ర్చకు దారితీసిన‌ అంశాల్లో పెట్రోధ‌ర‌ల పెరుగుద‌ల ఒక‌టి. కొన్ని ప్రాంతాల్లో లీట‌రు పెట్రోల్ ధ‌ర‌ వంద రూపాయ‌లు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో వంద‌కు చేరువ‌లో ఉంది. గ‌త యూపీఏ హ‌యాం వ‌రకూ ధ‌ర‌ల నియంత్ర‌ణ కేంద్రం చేతుల్లోనే ఉండేది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ధ‌ర‌ల నిర్ణ‌యాధికారం ఆయిల్ కంపెనీల‌కే అప్ప‌గించింది. దీంతో.. అవి ఇష్టారీతిన పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఈ భారం దేశ ప్ర‌జ‌లంద‌రిపైనా ప‌డుతుండ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ స్పందించారు. ఈ పాపం గ‌త ప్ర‌భుత్వాల‌దేన‌ని ఆరోపించారు. ఇంధన దిగుమతుల విషయంలో గత ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. మ‌రి, ఇందులో నిజ‌మెంత‌? ఈ పాపం నాటి ప్ర‌భుత్వాల‌దేనా?

పెరుగుతున్న ధ‌ర‌లు..
గ‌డిచిన ప‌న్నెండు రోజులుగా పెట్రోలు ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ.89.88, డీజిల్ ధర రూ.80.27గా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ ధర రూ.94.18కు, డీజిల్ ధర రూ.88.31కు చేరాయి. అటు అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 39 పైసలు పెరుగుదలతో లీట‌రు ధ‌ర రూ.96.48కు చేరింది. డీజిల్ పై 39 పైసలు పెర‌గ‌డంతో.. లీట‌రు రూ.90.10ల‌కు పెరిగింది. దీంతో విపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర‌ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు వసూలు చేస్తూ గత ప్రభుత్వాలను నిందిస్తారా?’ అని మండిప‌డుతున్నాయి.

మోడీ మాట‌ల్లో అస‌త్యాలే ఎక్కువ‌..
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెప్పిన మాట‌ల్లో ఎక్కువగా అబద్ధాలే ఉన్నాయ‌ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2013 వరకూ పెట్రోల్‌పై కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు మొత్తం ధరలో 44 శాతం వరకూ ఉండేవి. ఇప్పుడు అవి 100 నుంచి 110 శాతం వరకూ పెరిగాయని చెబుతున్నారు. అంతేకాదు.. మన్మోహన్ సింగ్ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్ల వరకూ పెరిగింది. కానీ.. ఇప్పుడు 60 డాలర్లకే పడిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. పెట్రోల్ ధర రూ.100కు చేరింది. అలాంట‌ప్పుడు గత ప్రభుత్వాలు ఈ ప‌రిస్థితికి ఎలా కారణం అవుతాయని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అంత‌ర్జాతీయంగా త‌గ్గిన ధ‌ర‌లు..
2015 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ.. భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. దాదాపు ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్‌పై ఇంత భారీగా పన్నులు లేవని అంటున్నారు. బ్రిటన్‌లో 61 శాతం, ఫ్రాన్స్‌లో 59 శాతం, అమెరికాలో 21 శాతం పన్ను వేస్తుండ‌గా.. మ‌న దేశంలో 100 నుంచి 110 శాతం వ‌ర‌కు ప‌న్నులు వేస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ పన్నుల ద్వారా రూ. 20 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయని అంటున్నారు.

నిరుపేద‌ల‌పై తీవ్ర భారం..
ఈ ప‌రిస్థితి వ‌ల్ల నిరుపేద‌ల‌పై తీవ్ర ఆర్థిక భారం ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంది పెట్రోల్ ధ‌ర‌లు పెరిగితే వాహ‌న‌దారులు మాత్ర‌మే ఇబ్బంది ప‌డ‌తార‌ని అనుకుంటారు. కానీ.. వాస్త‌వం వేరే ఉంది. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెరిగితే ర‌వాణా భారం అవుతుంది. అప్పుడు పాలు, కూర‌గాయ‌లు మొద‌లు నిత్యావ‌స‌రాలు స‌ర‌ఫ‌రా చేసే వాహ‌నాల‌న్నీ తాము భారం మోయ‌లేమ‌ని చేతులు ఎత్తేస్తాయి. ఫ‌లితంగా ర‌వాణా ధ‌ర‌లు పెరుగుతాయి. అది పెరిగిన‌ప్పుడు.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను కూడా వ్యాపారులు పెంచేస్తారు. ఇలా.. దేశం మొత్తంపై ఇది తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. కరోనా సంక్షోభం వ‌ల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు క‌నిపిస్తుండ‌ర‌గా.. ఈ ఇంధన ధరల పెరుగుద‌ల‌తో దేశం మాంద్యం వైపు వెళ్లేఛాన్స్ ఉంద‌ని కూడా చెబుతున్నారు.