కాళేశ్వరం నీళ్లన్నీ గోదావరి పాలేనా!

గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై ఏడాది పూర్తికావస్తున్నది. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు తొలి ఏడాదిలో అనుకున్నంత నీటిని లిఫ్ట్ చేసిందా? ఇంతకీ ఎంత ఆయకట్టుకు నీరందించింది? అనే వివరాలను అధికారులు ఎవ్వరు ప్రస్తావించడం లేదు. గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది లక్ష్యం. ఈ తొలి ఏడాది మోటార్లను ట్రయల్ చేయటంపైనే రాష్ట్ర ప్రభుత్వం […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 4:27 pm
Follow us on


గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై ఏడాది పూర్తికావస్తున్నది. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు తొలి ఏడాదిలో అనుకున్నంత నీటిని లిఫ్ట్ చేసిందా? ఇంతకీ ఎంత ఆయకట్టుకు నీరందించింది? అనే వివరాలను అధికారులు ఎవ్వరు ప్రస్తావించడం లేదు.

గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది లక్ష్యం. ఈ తొలి ఏడాది మోటార్లను ట్రయల్ చేయటంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంప్ హౌస్ లను విజయవంతంగా రన్ చేసినా కొత్త ఆయకట్టుకు మాత్రం నీరందించలేక పోయిన్నట్లు చెబుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసిన రెండు నెలల్లోనే అటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ఎగువన కడెం ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అప్పటివరకు ఎల్లంపల్లి, సుందిళ్ల వరకు లిఫ్ట్ చేసిన నీళ్లన్నీ మళ్లీ గేట్లెత్తి గోదావరిలోకి వదిలేయాల్సి వచ్చింది. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఎత్తేయటం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది.

దీంతో జూన్‌‌, జులై నెలల్లో 40 రోజులకు పైగా శ్రమించి, రూ. 50 కోట్ల విద్యుత్ వాడి ఎత్తిన నీళ్లన్నీ వదిలేయాల్సి వచ్చింది. దాదాపు 18 టీఎంసీల నీళ్లు తిరిగి గోదావరిలోకి పోయాయి. వీటితో పాటు ఈ ఏడాది పొడవునా మంచిగా కురిసిన వర్షాలతో వెయ్యి టీఎంసీల నీళ్లు మేడిగడ్డకు దిగువకు వదిలేయాల్సి వచ్చింది.

దీంతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎంత ఫలితం వచ్చింది? అదనంగా ఏం సమకూరింది? అనేది అంచనా వేయటం ఇరిగేషన్ విభాగానికీ పరీక్షగా మారింది. ఈ ఏడాది అన్ని పంప్ హౌస్ లను రన్ చేయించి నీటిని మిడ్ మానేరు వరకు లిఫ్ట్ చేయటాన్ని ఇరిగేషన్ విభాగం తొలి ఏడాదిలో నమోదు చేసిన విజయంగా చెప్పుకుంటోంది.

గత ఏడాది జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం నుంచి మొత్తం 225 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసి18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు సాగు నీరు అందించామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. గత 11 నెలల్లో లిఫ్ట్ ‌‌ చేసిన నీళ్లను లెక్కగడితే అనుకున్న లక్ష్యంపై చేరుకోలేక పోయారని స్పష్టం అవుతుంది.

ఇప్పటివరకు మేడిగడ్డ బ్యారేజీ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా 60 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. అంటే తొలి ఏడాదిలో కేవలం 26 శాతం నీళ్లనే లిఫ్ట్ చేశారు. అన్నారం బ్యారేజీ నుంచి 56 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీ నుంచి 53 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌‌ చేసి ఎల్లంపల్లికి ఎత్తిపోశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ రూట్లో నందిమేడారం నుంచి 68 టీఎంసీలు, లక్ష్మీపూర్ పంపుహౌస్‌ నుంచి 66 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. ఈ భారీ మోటార్లన్నీ నడిపేందుకు కరెంటు బిల్లుల ఖర్చే వందల కోట్ల రూపాయలు దాటిపోయింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ పనులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తం 7 లింక్‌‌లుగా పనులు చేపట్టారు. లింక్ వన్లో మేడిగడ్డ (లక్ష్మీ), అన్నారం (పార్వతి), సుందిళ్ల (సరస్వతి) బ్యారేజీలతోపాటు, మూడు పంప్‌‌హౌజ్‌లున్నాయి. లింక్‌‌ వన్ కింద 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలి.

ఇదంతా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోనే ఉంటుంది. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పటికీ సైడ్ కాల్వలు, కొత్త ఆయకట్టుకు నీరందించే ప్లానింగ్ లేకపోవటంతో లింక్ వన్లో ఒక్క ఎకరం భూమికి కూడా కాళేశ్వరం నీళ్ల తడి అందలేదు.