Jagan On Visakha
Jagan On Visakha: విశాఖ నుంచి పాలన అంటూ సీఎం జగన్ హడావిడి చేస్తున్నారు. విజయదశమిని ముహూర్తం గా పెట్టుకున్నారు. ప్రభుత్వ శాఖల గురించి కార్యాలయాలను అన్వేషించాలని ఆదేశాలు ఇచ్చారు. ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ భవనాల అన్వేషణలో పడింది. మరోవైపు సీఎం క్యాంప్ కార్యాలయంగా భావిస్తున్న రిషికొండలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో జగన్ కు షాకింగ్ కలిగించే విషయం. రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణంఫై సుప్రీంకోర్టులో రిప్ పిటిషన్ దాఖలయింది.
లింగమనేని శివరాం ప్రసాద్ అనే పర్యావరణ వేత్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా క్యాంపు కార్యాలయం నిర్మించారని పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు విచారణ జరుగుతుండగా.. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో జగన్ విశాఖ నుంచి పాలన ప్రశ్నార్ధకంగా మిగలనుంది.
అయితే ఇప్పటివరకు రిషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయములో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. అవి సీఎం క్యాంప్ ఆఫీసు కోసమే చేపడుతున్న నిర్మాణాలే అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కోర్టుల్లో కేసులు ఉండడం వల్లే అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం మడత పేచీ వేసే అవకాశం ఉన్నందున పిటీషనర్ ముందస్తు ఆలోచన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పై జిఏడి ఇచ్చిన జీవో, పలు పత్రికల్లో వచ్చిన వార్తలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఆదేశాల కాపీలు జత చేశారు. గతంలో రిషికొండ నిర్మాణాలపై జస్టిస్ బి ఆర్ గవాయి నేతృత్వంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జత చేశారు.
ఇప్పటికే రిషి కొండపై నిర్మాణాలను పూర్తి చేశారు. ఇందుకుగాను భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇంజనీర్లను పక్కనపెట్టి మరీ.. ప్రైవేటు ఆర్కిటెక్చర్లను తెచ్చి మరీ కీలక నిర్మాణాలు జరిపారు. ఇప్పటి వరకు 270 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ప్రతికూల ఆదేశాలు ఇస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రిషికొండలో పర్యాటక ఆనవాళ్లు లేకుండా చేశారు. పర్యాటక నిర్మాణాల మాటున కొండను తవ్వేశారు. ఇప్పుడు గానీ వ్యతిరేక తీర్పు వస్తే ఏమిటన్న ప్రశ్న అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఎక్కడ తమను బాధ్యులను చేస్తారో అన్న ఆందోళన కనిపిస్తోంది.