Telangana BJP: తెలంగాణలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒంటరి పోరాటానికి మొగ్గు చూపిన బిజెపి.. ఇప్పుడు జనసేన, టిడిపిల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ లు సమావేశం కావడంతో… బిజెపి పొత్తుల వైపు చూస్తోందని అర్థమవుతోంది. అటు తెలంగాణలో సరికొత్త కూటమి ఒకటి ఏర్పాటు అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఎన్డీఏ లో జనసేన భాగస్వామ్య పార్టీ. కానీ తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య బంధం అంతంత మాత్రమే. తమకు సినిమా వాళ్లు అవసరం లేదన్నట్టు గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు వ్యాఖ్యానించారు. తాము తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణలో బిజెపి మూడో స్థానానికి పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కాషాయ దళంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.జనసేన,టీ డిపిలను కలుపుకొని వెళ్లడం ద్వారా.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ల స్థానాలను తగ్గించవచ్చని బిజెపి భావిస్తోంది. అదే జరిగితే తెలంగాణలో హాంగ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేసి.. అందుకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటుంది.
మొన్నటికి మొన్న నారా లోకేష్ ను అమిత్ షా తో సమావేశం ఏర్పాటు చేయడం వెనుక కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అదే విషయాన్ని లోకేష్ సైతం ప్రకటించారు. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకునే అమిత్ షా తో తనను మాట్లాడించారని చెప్పడం ద్వారా బిజెపి అసలు ఉద్దేశాన్ని లోకేష్ బయటపెట్టారు. తెలంగాణలో గెలుపు కోసమే టిడిపిని బిజెపి పెద్దలు దగ్గర చేసుకుంటున్నారు అన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో బిజెపితో పొత్తు విషయంలో సమయం దాటిపోయిందని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. అప్పట్లో బీజేపీ అంత సుముఖంగా లేకపోవడం వల్లే చంద్రబాబు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి అవసరం బిజెపికి ఏర్పడింది. బిజెపి అవసరం చంద్రబాబుకు తప్పనిసరిగా మారింది. అందుకే బిజెపితో టిడిపి జతకలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా రావడం కూడా ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. నేరుగా బిజెపి కి మద్దతు కంటే పొత్తుకే జనసేన శ్రేణులు మొగ్గుచూపుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జన సేన 32 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే అధికం. ఇప్పుడు గానీ బిజెపి పొత్తు ప్రతిపాదనకు మొగ్గు చూపితే.. టిడిపిని సైతం కలుపుకొని పోవాలని పవన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే ఈపాటికే లోకేష్ తో మంతనాలు జరిపినందున ఇది మరింత ఈజీ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల ముంగిట బిజెపి, జనసేన, టిడిపి కూటమి కట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.