CM Jagan: మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు నచ్చితేనే ప్రభుత్వాలు మనుగడ సాధించగలవు. లేకుంటే ఇట్టే అధికారాన్ని దూరం చేసేందుకు ప్రజలు వెనుకాడరు. అయితే దురదృష్టవశాత్తు ఏపీలో జగన్ సర్కార్ అంతులేని ప్రజామోదాన్ని పొందగలిగింది. కానీ మధ్యలో ప్రజల మూడ్ ప్రతికూలంగా వచ్చినా.. పెద్దగా పట్టించుకోలేదు. పైగా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సంపూర్ణ విజయం తమకు దక్కనుందని.. వై నాట్ 175 అన్న నినాదాన్ని మరింత రాటుదేల్చారు. గుణపాఠాలు నేర్చాల్సిన సమయంలో అహంతో వ్యవహరించారు.తప్పులను దిద్దుకోకుండా.. మరిన్ని తప్పులు చేస్తూ ముందుకు సాగారు. దాని పర్యవసానాలు గట్టిగానే తగులుతున్నా.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో జగన్కు గట్టి దెబ్బ తగిలింది. జనాభిప్రాయాన్ని తెలియజేసింది. కానీ సకల శాఖ మంత్రి సజ్జల లాంటివారు మా ఓటర్లు వేరే ఉన్నారంటూ వక్ర భాష్యం చెప్పుకున్నారు. పట్టభద్రులలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఉన్న విషయాన్ని మరిచిపోయారు. విద్యాధికులు, ఉద్యోగులు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. అది ఒక తీర్పేనా? అని ఎగతాళి చేసి మాట్లాడారు. 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలనే ఆధారంగా చేసుకుని.. అంతులేని విజయ గర్వంతో విపరీత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
ఎన్నికల మూడ్.. అంటే సర్వేలో, ఒపీనియన్ పోల్స్ కాదు. ప్రజల వ్యవహార శైలి బట్టి సైతం ఇట్టే తెలుసుకోవచ్చు. తప్పులను సరిదిద్దుకోవచ్చు. తప్పు మీద తప్పు చేస్తూ జగన్ సర్కార్ ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటూ వచ్చింది. సమాజంలో విషయ పరిజ్ఞానం ఉన్నవారిని ఓటు బ్యాంకుగా చూడడంలో జగన్ ఇష్టపడరు. తాను సంక్షేమ పథకాలు పంచుతున్నాను.. వారంతా ఓటు వేస్తారన్న భ్రమలో ఉన్నారు. అంతకుమించి చేయడానికి ఇష్టపడడం లేదు. అభివృద్ధి లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్, బెయిల్ విషయంలో రాజకీయాలను పక్కన పెడదాం. ఈ విషయంలో చంద్రబాబు సైతం కరెక్టేనని చెప్పలేం. కానీ 73 సంవత్సరాల వయసులో కేసులతో ఇబ్బంది పెట్టారని ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే నాటుకు పోయింది. చంద్రబాబుకు బెయిల్ లభించిన క్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి ఈ తరహా సానుభూతి కూడా ఒక కారణం. దీనిని డేంజర్ బెల్ గా జగన్ సర్కార్ తీసుకోకుంటే మూల్యం తప్పదు. ఇటువంటి సమయంలోనే ప్రభుత్వ వ్యవహార శైలి బయటకు వస్తుంది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగితేనే సత్ఫలితాలు సాధ్యం. లేకుంటే ఓటమి నుంచి గట్టెక్కించడం దాదాపు అసాధ్యం. అయితే దీనిని జగన్ తెలుసుకుంటారో? లేదో? చూడాలి.