https://oktelugu.com/

Eenadu: ఏపీలో ఈనాడు ఫ్రీ నా? ఇంటింటికీ పంచుతున్నారా?

త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు సాక్షి, ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటాపోటీగా కథనాలు ప్రచురిస్తున్నాయి. కుల రాజకీయాలు ఎక్కువగా ఉండే ఏపీలో నేతల పోటాపోటీ మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 2, 2024 / 12:14 PM IST

    Eenadu

    Follow us on

    Eenadu: పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు అని వెనకటి కాలంలోనే ఓ మహానుభావుడు అన్నాడు. నాటి నుంచి నేటి వరకు అది ప్రతి సందర్భంలోనూ నిరూపితం అవుతూనే ఉంది. రాజకీయ నాయకులకు ప్రచారం కావాలి.. ఆ ప్రచారం చేసే బాధ్యతను మీడియా తలకు ఎత్తుకోవాలి. ఎలాగూ ప్రచారం చేస్తున్నాం కాబట్టి మీడియా పెద్దలు వైట్ కాలర్ తరహాలో దోచుకుంటారు.. దోచుకున్నది రెండవ కంటికి తెలియకుండా దాచుకుంటారు. ఈ దాపరికం అనేది రాజకీయ నాయకులకు తెలుసు.. అందుకే మీడియా పెద్దలను కాపాడుతుంటారు. ఆ మీడియా పెద్దలు కూడా రాజకీయ నాయకులకు అండగా ఉంటారు. మొత్తానికి అది ఒక సయామి కవలల సంబంధం. తెలుగు నాట మాత్రం పత్రికలకు రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు టిడిపికి కాపు కాస్తాయి. సాక్షి జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటుంది. నమస్తే తెలంగాణ కెసిఆర్ కు రక్షణగా ఉంటుంది. తెలంగాణ విషయం అటు ఉంచితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టిడిపిని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఆంధ్రజ్యోతి, ఈనాడు.. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం దక్కేలా చూడాలని సాక్షి తెగ తాపత్రయపడుతున్నాయి. అయితే సాక్షి ఎలాగూ తన జగన్ భక్తిని దాచుకోదు. తన మాస్టర్ హెడ్ పక్కనే ప్రతిరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మను ప్రచురిస్తూ ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూట్రల్ ముసుగులో చంద్రబాబుకు భుజకీర్తులు తొడుగుతుంటాయి.

    త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు సాక్షి, ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటాపోటీగా కథనాలు ప్రచురిస్తున్నాయి. కుల రాజకీయాలు ఎక్కువగా ఉండే ఏపీలో నేతల పోటాపోటీ మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా అక్కడక్కడ వినిపిస్తున్న మాట ఏమిటంటే.. ఈనాడు పత్రికను ఏపీలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారని.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈనాడు తన ఫస్ట్ పేజీలో కచ్చితంగా ఒక బాక్స్ కొట్టి.. మా పత్రికను ఉచితంగా వేయడం లేదు అని రాసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉచితంగా వేసినా చెల్లు బాటవుతుంది. కానీ రేపటి నాడు ఈనాడుకు ప్రతిబంధకంగా మారుతుంది. డబ్బులు పెట్టి ఎవరూ పేపర్ కొనరు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఆ పేపర్ ఉచితంగా పంపిణీ చేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తాయి. కానీ ఎన్నికల తర్వాత కూడా ఇలానే చేయాలంటే మాత్రం చేతులు ఎత్తేస్తాయి.. ఉదాహరణకు ఏపీలో రెండు కోట్ల కుటుంబాలు ఉన్నాయి అనుకుంటే రోజుకు రెండు కోట్ల పేపర్లు ఉదాహరణకు ఏపీలో రెండు కోట్ల కుటుంబాలు ఉన్నాయి అనుకుంటే, రోజుకు రెండు కోట్ల పేపర్లు ప్రింట్ చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. సర్క్యులేషన్ పరంగా ఈ లెక్కలు ఈనాడు యాజమాన్యానికి గొప్పగా అనిపించవచ్చు. ఈ లెక్కలతో ఏ బి సి రేటింగ్స్ ప్రకారం యాడ్స్ కూడా భారీగానే తీసుకోవచ్చు. కానీ పేపర్ ప్రింట్ చేసి అమ్మినందుకు ఒక్క రూపాయి కూడా ఈ యాజమాన్యానికి రాదు. పైగా ప్రింట్ మీడియా రోజురోజుకు పతనమవుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నం చేయాలంటే యాజమాన్యానికి ఒకింత ఇబ్బందికరమే.

    అయితే ఏపీలో చాలా చోట్ల ఈనాడు పత్రికను ఉచితంగా వేస్తున్నారని అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తమకు అవసరం లేకపోయినప్పటికీ ఇంటి ముందు ఈనాడు పేపర్ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా టిడిపికి అనుకూలంగా ఉండే ఒక పేపర్ ప్రతిరోజు లక్ష కాపీలను అదనంగా ముద్రించేది. ఆ కాపీలను టిడిపి బలంగా ఉన్నచోట్ల ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసేది. పేరుపొందిన ఒక వ్యాపారి ఇందుకు అయ్యే ఖర్చును అప్పట్లో భరించి నట్టు సమాచారం.. తర్వాత వైసిపి అధికారంలోకి రావడంతో.. ఆ పేపర్ ను పక్కనపెట్టి.. సర్కులేషన్ లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇప్పుడు ఆ బాధ్యత అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే గత వారం రోజులుగా ఈనాడు ఇంటింటికి ఉచితంగా వేస్తున్నారని ప్రచారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగుతోంది. మరోవైపు సాక్షి పత్రికను కూడా ఉచితంగా వేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో కొంతమేర పత్రికను ఉచితంగా వేసినప్పటికీ.. చాలాచోట్ల వైసిపి నాయకులు చందా డబ్బులు కట్టి తమ కార్యకర్తలు, ఇతర ప్రజలకు పేపర్ ఉచితంగా చేరవేశారని సమాచారం. ఎన్నికల తర్వాత కూడా అలానే చేశారని.. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని సమాచారం. తెలంగాణలోనూ నమస్తే తెలంగాణ పత్రిక విషయంలో మొన్నటి వరకు భారత రాష్ట్ర సమితి నాయకులు అలానే చేశారు. అధికారాన్ని కోల్పోవడంతో మాకు భారం అవుతుందని చేతులెత్తేశారు. ఎలాగూ సర్కులేషన్ పడిపోతే..యాడ్స్ కూడా పడిపోతాయి.. అప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టం అవుతుంది. సరిగా ఇప్పుడు ఈ పరిస్థితి నమస్తే తెలంగాణలో ఉంది. అధికారం కోల్పోయి నెలరోజులు గడవకముందే నమస్తే తెలంగాణలో పరిస్థితి తారు మారయింది.