Alcoholics : పిల్లలను గారాబం చేస్తే ఎంతటి అనార్థాలో ఆ కేంద్రమంత్రి కళ్లారా చూశాడు. తాగుడుకు బానిసైన కొడుకు జీవితాన్ని సరిదిద్దలేకపోయాడు. డబ్బు, పరపతి, హోదా అధికారం ఉండి కూడా డ్రగ్స్, మద్యానికి బానిస అయిన కొడుకును కాపాడుకోలేకపోయారు. పెళ్లైతే బాగుపడుతాడని అనుకున్నాడు. కోడలు, రెండేళ్ల కొడుకు ఉన్నా కూడా కొడుకు మారలేదు. తాగుడు ఆపలేదు. చివరకు కళ్లముందే చనిపోయాడు. అందుకే తన బాధ ఎవరికీ రాకూడదని ఆ కేంద్రమంత్రి సంచలన కామెంట్స్ చేశారు. ఒక దేశానికి కేంద్రమంత్రిగా ఉండి తాగుబోతులకు పిల్లను ఇవ్వొద్దంటూ కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆయన పడిన బాధ ఎవ్వరికీ రాకూడదనుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ లంభువా నియోజకవర్గంలో మద్యం అలవాటు విముక్తిపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ మద్యం అలవాటుకు బానిసలు అయిన వారి గురించి బాధ పడ్డారు. తన కుమారుడిని కాపాడుకోలేకపోయినందుకు భాగోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో చేర్చినా ఫలితం రాకపోవడంపై కన్నీరు కార్చారు. ఎవరు కూడా మద్యానికి బానిసలుగా మారొద్దని సూచించారు.
‘‘తన కొడుకు తాగుడుకు బానిస కావడంతో డీ అడిక్షన్ సెంటర్ లో వేశాం.. ఆ చెడు అలవాటు మానేస్తాడని భావించాం.. పెళ్లి చేసుకుంటానంటే ఆరునెలలకే పెళ్లి చేశాం. అయినా తాగుడు మానలేదు. చివరకు రెండేళ్ల క్రితం తాగుడుకు బానిసై చనిపోయాడు. నా కొడుకు చనిపోయినప్పుడు అతడి కుమారుడి వయసు కేవలం రెండేళ్లే.. ఇప్పుడు అతడి భార్య అయిన నా కోడలు ఏకాకిగా మారింది.. కొడుకు అనాథగా మారాడు.’’ అంటూ కేంద్రమంత్రి తన ఇంటి కథను బాధగా వర్ణించాడు.
నా ఇంట్లో జరిగిందో ఏ ఇంట్లో జరగవద్దని.. మీరు మీ కుమార్తెలు.. అక్కాచెల్లెల్లను ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడాలని కేంద్రమంత్రి కోరారు. అసలు మద్యం తాగేవాడికి పిల్లనివ్వవద్దని సంచలన ప్రకటన చేశారు.
కేంద్రమంత్రి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆయన ఇంట్లో జరిగిన విషాదాన్ని ఎవరూ అనుభవించకూడదన్న ఆయన ఆవేదన కళ్లకుకట్టింది.ఇప్పటికైనా తాగుబోతులు మారాల్సి ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.