Homeజాతీయ వార్తలుమావో ‘హిడ్మా’ చుట్టు బిగుస్తున్న ఉచ్చు

మావో ‘హిడ్మా’ చుట్టు బిగుస్తున్న ఉచ్చు

Hidma
చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో 22 మంది జవాన్లు ప్రాణాలొదిలారు. బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఆ రోజు ఒక దుర్దినంలా మిగిలింది. అయితే.. ఈ అటాక్‌ వెనుక ఉన్నది ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఈ హిడ్మా ఎవరనేది ఒకింత ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు.. పోలీసులు మాత్రం హిడ్మాను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

హిడ్మా అలియాస్‌ హిడ్మాన్న(40) సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరిజనుడు. 90వ దశకంలో తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్ నంబర్1కి నాయకత్వం వహిస్తున్నాడు. భయంకరమైన, ఘోరమైన ఆకస్మిక దాడులు చేయడంలో హిడ్మా దిట్ట. ప్రస్తుతం మహిళలతో సహా 180-250 మంది మావోయిస్టుల దళానికి అతడు నాయకత్వం వహిస్తున్నాడు. దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీలో (డీకేఎస్‌జడ్‌) లోనే కాక సీపీఐ(ఎం) 21 సుప్రీం మెంబర్‌ సెంట్రల్‌ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అతడిని సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా నియమించినట్లు తెలిసింది. భీమ్‌ మాండవి హత్యా నేరంలో ఎన్‌ఐఏ హిడ్మాపై చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేసింది. అతని ఏజ్‌ 40 ఏళ్లు ఉంటుందని అంచనా.

తాజాగా.. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ స్పందించారు. చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్‌ కమాండర్‌‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని వెల్లడించారు. అందుకు తగిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని.. ఇక తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఏడాదిలోపే వారి కథ ముగిస్తామన్నారు.

హిడ్మా విషయంలో చేపట్టబోయే యాక్షన్‌ ప్లాన్‌ ఫలితం గురించి నర్మగర్భంగా చెప్పారు. నక్సల్స్‌పై పోరు మరింత ఉధృతం చేస్తున్నట్లు కుల్దీప్‌సింగ్‌ పేర్కొన్నారు. మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని.. అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఓ ఏడాదిలోపు పూర్తవుతుందని పేర్కొన్నారు.

కాగా.. తాజా ఎన్‌కౌంటర్‌‌లో అతడు వేసిన వ్యూహంలో బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్‌ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా పెరిగేవని అన్నారు. ఈ ఘటనలో నక్సల్స్‌ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్‌ నాలుగు ట్రాక్టర్లను వాడారని తెలిపారు. బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. వాటిని తప్పించుకుంటూ గాయపడిన వారిని కాపాడుకుంటూ బలగాలు సమర్థంగా పనిచేశాయని.. వారి పట్ల గర్వంగా ఉన్నానని కుల్దీప్‌ వెల్లడించారు. పూర్తిస్థాయిలో బలగాలు సన్నద్ధంగా లేవంటూ వస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఈ ఆపరేషన్‌ కోసం ఆ ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని.. 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడారని తెలిపారు. నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని.. జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకొచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. వారి మరణాలు వృథా పోవని ఆవేదన చెందారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version