అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కుదిరిన ఓ ఒప్పందాన్ని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం రద్దు చేశారు. రెండేళ్ల క్రితం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కు ఇచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దు చేసింది. దీంతో అమెజాన్ అధిపతి జెప్ బెజోస్ కు కనకవర్షం కురిసింది. క్లౌడ్ కంప్యూటింగ్ కోసం అమెరికా రక్షణ శాఖ 2019లో మైక్రోసాఫ్ట్ తో 10 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది.
ఈ డీల్ పై గత కొంత కాలంగా ప్రభుత్వం , టెక్ దిగ్గజాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ట్రంప్ జోక్యంతోనే ఆ డీల్ మైక్రోసాఫ్ట్ కు చేరిందంటూ అమెజాన్ ఆరోపించింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. అమెజాన్ ఆరోపణలను కోర్టు కొట్టివేయకపోతే మైక్రోసాఫ్ట్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తెలిపింది. అమెజాన్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ మైక్రోసాఫ్ట్ చేసిన అభ్యర్థనను ఫెడరల్ కోర్టు తిరస్కరించింది.
పెంటగాన్ తాజా ప్రకటనతో మంగళవారం నాటి ట్రేడ్ సెషన్ లో అమెజాన్ షేర్లు 4.7 శాతం పెరిగాయి. దీంతో జెప్ బెజోస్ నికర సంపద 8.4 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం సంపద 211 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలయనీర్ సూచీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ మొత్తం సంపద కలిగిన ఏకైక వ్యక్తి బెజోసే కావడం విశేషం.
ఈ ఏడాది జనవరిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నికర సంపద 210 బిలియన్ డాలర్లను తాకింది. అప్పుడు ఆయన బెజోన్ ను దాటి ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఆ తరువాత ఆయన సంపద భారీగా పడిపోయింది. దీంతో బెజోస్ మళ్లీ నెంబర్ వన్ స్థానంలో వచ్చి అక్కడే స్థిరంగా ఉంటున్నారు. ప్రస్తుతం 180.8 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.