Peddireddy: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చేందుకు జగన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చి గట్టి సంకేతాలు పంపారు. అయితే కొందరి విషయంలో మినహాయింపు ఇవ్వడం పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం విషయంలో జగన్ ఈ మార్పునకు అంతగా మొగ్గు చూపకపోవడం విశేషం. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు విషయంలో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటే చెల్లుబాటవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తాడేపల్లి స్క్రూట్నీ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో సజ్జల రామకృష్ణారెడ్డి తో కలిసి కీలక భూమిక వహిస్తున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబంలో నలుగురు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో తమ చెప్పు చేతల్లో ఉన్న నేతలను పోటీ చేయిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ కనుసన్నల్లో ఉండడం విశేషం. చివరకు మంత్రిరోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరిలో సైతం పెద్దిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతోంది.ఈసారి రిజర్వుడ్ నియోజకవర్గాలను తప్పించి మిగతా వాటిలో తన బంధువులతో నింపేసే పనిలో పెద్దిరెడ్డి పడ్డారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నలుగురు బంధువులకు సైతం ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకుంటున్నారు. పుంగనూరు నుంచి తన సోదరుడి కుమారుడిని నిలబెట్టాలని భావిస్తున్నారు. పీలేరు నుంచి కుమారుడు మిథున్ రెడ్డిని బరిలో దించి మంత్రిని చేయాలని చూస్తున్నారు. పలమనేరులో మరో సోదరుడిని నిలబెట్టినందుకుడిసైడ్ అయ్యారు. తంబళ్లపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. మరోసారి ఆయన పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగిరి నుంచి ఈసారి రోజాకు టిక్కెట్ ఇవ్వొద్దని హై కమాండ్ పై పెద్దిరెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే రోజా విషయంలో హై కమాండ్ వేరే ఆలోచనతో ఉంది. ఒకవేళ పెద్దిరెడ్డి పట్టు పెడితే మాత్రం రోజా మార్పు అనివార్యం. మొత్తంగా చిత్తూరు జిల్లా వైసీపీ అంటే జగన్ అక్కడ కనిపించరు. అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబంధహస్తాల్లో పార్టీ చిక్కుకుందన్న సెటైర్లు పడుతున్నాయి. అయితే అభ్యర్థుల మార్పు విషయంలో పెద్దిరెడ్డికి మినహాయింపు ఇచ్చారా అని వైసిపి లోని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.