Vangaveeti Radha
Vangaveeti Radha: రాజకీయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వక మానవు. చాలామంది తప్పుడు నిర్ణయాలతో తమ రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్న వారు ఉన్నారు. అటువంటి వారిలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. 2004లో రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధకు.. ఎమ్మెల్యే టికెట్ లభించింది. చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ తో.. ఆ పార్టీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించిన వినలేదు. అది మొదలు ఇప్పటివరకు రాజకీయంగా కుదురుకోలేదు. పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.
వంగవీటి రాధాకృష్ణ చర్యలు ఎవరికి అంతు పట్టడం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. లోకేష్ పాదయాత్రలో సైతం యాక్టివ్ గా పాల్గొన్నారు. అదే సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే జనసేన నేతలతో సైతం సఖ్యతగా ఉన్నారు. దీంతో వంగవీటి రాధా చుట్టూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన విజయవాడ తూర్పునియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు.గత ఎన్నికలకు ముందు అదే నియోజకవర్గాన్ని ఆశించిన వైసీపీ హై కమాండ్ మాత్రం మొండి చేయి చూపింది. అందుకే ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. అయితే ఇప్పటికీ టిడిపి టిక్కెట్ విషయంలో క్లారిటీ రాలేదు. అక్కడ టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉండడమే అందుకు కారణం. 2014, 2019 ఎన్నికల్లో 15 వేల ఓట్లకు తగ్గకుండా రామ్మోహన్ మెజారిటీ సాధించారు. మరోసారి అక్కడ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో రాధాకృష్ణకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
జనసేన తో పాటు వైసిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి రాధాకృష్ణకు ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తప్పుడు నిర్ణయాలతో చేతులు కాల్చుకున్న ఆయన.. ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. ఏపీలో సైతం పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉంది. దీంతో ఆ పార్టీ అగ్రనేతలు వంగవీటి రాధాకృష్ణకు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం.రాధా తండ్రి వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వశ్రమం అవుతుందని.. నీకు అన్ని విధాల అండగాఉంటామని.. కాపు ఫ్యాక్టర్ ఓటు ప్రభావితం చేస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ నుంచి రాధాకృష్ణకు అభయం వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే టిక్కెట్ ఇస్తామని ఆఫర్ పెట్టినట్లు సమాచారం. ఈ బాధ్యతలను కీలక నేతకు అప్పగించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గత అనుభవాల దృష్ట్యా తప్పటడుగులు వేయవద్దని.. కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో రకాల ఒత్తిళ్లతో రాధాను తీసుకెళ్లాలని చూసినా.. ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పార్టీ మారే యోచన లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్నవన్నీ పుకార్లేనని.. అందులో ఎంత మాత్రం నిజం లేదని.. అభిమానులు ఎవరు నమ్మవద్దని రాధాకృష్ణ చెబుతున్నట్లు తెలుస్తోంది.