
Pawan Kalyan : పవన్ మనసులో ఏముంది? వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళతారు? ఒక వేళ పొత్తు ప్రకటిస్తే ఎన్ని సీట్లు తీసుకుంటారు? బీజేపీతో వెళతారా? లేకుంటే టీడీపీతో డిసైడ్ అవుతారా? లేకుంటే ఆ రెండు పార్టీలతో కలిసే ప్రయాణం చేస్తారా? ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. వీటిపై పవన్ మరి కొద్ది గంటల్లో స్పష్టతనివ్వనున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యంది. నేటితో పదో ఏడాదిలో అడుగు పెడుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో పదో ఆవిర్భావ సభను వేడుకగా జరపాలని జనసేన డిసైడ్ అయ్యింది. మచిలీపట్నంలో సువిశాల ప్రాంగణంలో సభను ఏర్పాటుచేసింది. దీనికి పొట్టి శ్రీరాములు ప్రాంగణంగా నామకరణం చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జన సైనికులు తరలివస్తారని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.
2024 ఎన్నికలే టార్గెట్ గా పవన్ కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది. వైసీపీ విముక్త ఏపీకి కృషిచేస్తానని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అవసరమైతే పొత్తులతోనైనా ఓడిస్తానని శపధం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేయనున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం నెలకొంది. అయినా మధ్యలో పవన్ నిర్ణయంపై ప్రభావం చూపేలా అనేక అంశాలు బయటపడ్డాయి. సీట్లు, అధికార పంపకం వంటి విషయంలో సరికొత్త డిమాండ్లు, కులాల ప్రభావం వంటివి తెరపైకి రావడంతో పొత్తుపై ప్రతికూల వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ ఏం చెబుతారన్నది హాట్ టాపిక్ గా మారింది.
జనసేన ఆవిర్భావించి నేటికి సరిగ్గా పదేళ్లవుతోంది. అయితే సుదీర్ఘ విరామంలో ఎన్నో ఆటుపోట్లను పార్టీ ఎదుర్కొంది. తొలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన పవన్ గత ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీచేసి దారుణంగా ఓడిపోయారు. అటు పార్టీ ఓటమితో పాటు తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూశారు. కానీ నిరుత్సాహ పడలేదు. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతారన్న ప్రచారాన్ని అధిగమిస్తూ నిలబడ్డారు. జనసేనను డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలబెట్టారు. ఓడినా ప్రజా క్షేత్రంలో ఉంటానని.. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి నిలబడ్డారు. జనసేన పది సంవ్సతరాల పాటు ఏపీ రాజకీయ యవనికపై నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు.
అయితే పవన్ సభకు అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అత్యవసరంగా మచిలీపట్నం ఆవిర్భావ సభను టార్గెట్ చేసుకొని సెక్షన్ 30, 1861 పోలీస్ చట్టం అమల్లోకి తేవడం అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14న జాతీయ రహదారులపై ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదు. అనుమతులు లేకుండా ర్యాలీలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు.అయితే దీనిని లెక్కచేయని జనసైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది జన సైనికులు మచిలీపట్నంచేరుకుంటున్నారు. వందలు వేలుగా మారారు. మధ్యాహ్నానికి లక్షలుగా మారుతారని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు సభా వేదిక వద్దకు పవన్ చేరుకోనున్నారు. అయతే పవన్ ఎలాంటి ప్రకటనలు చేయనున్నారోనని జన సైనికులు,రాజకీయ పక్షాలు ఆతృతతో ఎదురుచూస్తున్నాయి.