Pawan Kalyan : ఒక రాజకీయ నాయకుడిని బలంగా మార్చడానికి ఒక చిన్న సంఘటన చాలు.. ఒక భారీ ప్రతిఘటన చాలు. అదే అతడికి జనాల్లో క్రేజ్ తెస్తుంది.. రాజ్యాధికారం సాధించేలా చేస్తుంది. జగన్ కు కోడికత్తి దాడి, వైఎస్ వివేకా హత్యతో బోలెడంత బూస్ట్ వచ్చి సీఎం అయిపోయారు. ఇప్పుడు అలానే విశాఖ, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పై నిర్బంధంతో ఒక్కసారిగా పవన్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ప్రతిపక్ష చంద్రబాబును తోసిరాజని ఇప్పుడు జగన్ ను ఎదురించే ఏకైనా మగాడిగా పవన్ ను జనాలు చూస్తున్నారు.
విశాఖలో పవన్ కళ్యాణ్ ‘జనవాణి’ని అడ్డుకొని ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకొని వైసీపీ సర్కార్ పెద్ద తప్పు చేసింది. అక్కడి నుంచే పోరుబాట పెట్టిన పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరింది. విశాఖలో జనసేన నేతలను భారీగా అరెస్ట్ చేయడం.. దానిపై పవన్ హైకోర్టుకెళ్లి వారందరినీ విడిపించాడు. అంతేకాదు.. ఆ పోరాటంలో పాలుపంచుకున్న వారిని మంగళగిరి జనసేన కార్యాలయానికి తీసుకొచ్చి మరీ సన్మానించాడు. దీంతో ఇటు కార్యకర్తల్లోనూ.. అటు ప్రజల్లోనూ పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని పేరు తెచ్చుకున్నారు. కష్టాల్లోని ప్రజలను ఆదుకుంటాడన్న నమ్మకం వారిలో కలిగించాడు.
ఇక ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై పవన్ పోరాటం అసమానం. కేవలం జనసేన వార్షికోత్సవానికి భూములు ఇచ్చారన్న కారణంతో ఆ రైతుల ఇళ్లను కూలగొట్టించిన జగన్ సర్కార్ పై పవన్ యుద్ధం చేశారు. జగన్ సర్కార్ దమనకాండను ప్రజల్లోకి తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా కాలినడకన పవన్ బయలు దేరి ఇప్పటం చేరుకొని ఇళ్లు కూలిపోయిన వారిని ఓదార్చాడు. స్వయంగా మనిషికి లక్ష చొప్పున పరిహారం అందించాడు.
ఇలా తనవారిని.. తనకు సహాయం చేసిన వారిని కాపాడుకోవడంలో పవన్ నిజమైన నేత అనిపించుకున్నారు. కష్టాల్లో ఉన్న వారి కోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధపడే నేతగా పేరు గాంచాడు. అందుకే ఇప్పటం, విశాఖ ఇష్యూల తర్వాత జనాల్లో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఏపీలో ఇప్పుడు జగన్ కు అసలు సిసలు పోటీదారుగా పవన్ కళ్యాణ్ ప్రజలకు కనిపిస్తున్నారు.