
ఏపీలోని రాజకీయ పార్టీలలో టీడీపీ, వైసీపీ తరువాత ప్రజల్లో ఆ స్థాయి ప్రాధాన్యత సంపాదించుకున్న పార్టీ జనసేన మాత్రమే. కానీ పవన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ పార్టీ రాష్ట్రంలో నేటికీ బలోపేతం కావడం లేదు. పవన్ , నాదెండ్ల మనోహర్ మినహా ఆ పార్టీలో ముఖ్య నాయకులు ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు కానీ ఆ పార్టీ కార్యకర్తలకు కానీ తెలియదు. ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ పవన్ వైసీపీపై ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.
2014 ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ ఉన్నపళంగా జనసేన పార్టీని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చి 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి తమ వంతు సహకారం అందించారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ మిత్రపక్షానికి పవన్ మద్దతు ప్రకటించడంపై రాజకీయ విశ్లేషకులు పవన్ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పినా వైసీపీకి వ్యతిరేకంగా ఆ పార్టీలకు మద్దతు ఇచ్చారు.
అయితే ఆ తర్వాత వైసీపీపై విమర్శల విషయంలో సైలెంట్ అయిన పవన్ 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ సర్కార్ తీసుకున్న మెజారిటీ నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ విబేధిస్తూ వస్తున్నారు. అంతర్వేది ఘటన విషయంలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని సీబీఐతో విచారణ జరిపించాలని మొదట పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
జగన్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశిస్తే విచారణకు ఆదేశించినంత మాత్రాన సమస్య పరిష్కారం అయినట్టు కాదని పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి వేల ఎకరాల భూములను రైతుల నుంచి టీడీపీ స్వాధీనం చేసుకున్న సమయంలో, టీడీపీ నేతలు అవినీతి చేసిన సమయంలో సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై మాత్రం ఏ పని చేసినా విమర్శలు చేస్తుండటం గమనార్హం.