Pawan vs Jagan : గత ఎన్నికల్లో కాపుల మద్దతు జగన్ పొందగలిగారు. చంద్రబాబు పై ఉన్న కోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు, కాపులకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం తదితర కారణాలతో ఆ వర్గం అధికార పార్టీకి దూరమైంది. దీంతో కాపు సామాజిక వర్గం పవన్ వైపు పూర్తిగా టర్న్ అయ్యింది. దీంతో టీడీపీకి లాభం చేసే అంశం అవుతుందని ఒక అంచనా ఉంది. ఈ తరుణంలో దానికి విరుగుడుగా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాపుల్లో పట్టు ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధాకృష్ణ లను వైసీపీలోకి రప్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం తనవైపు తిప్పుకోగలిగారు. వంగవీటి రాధా తో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలను వైసీపీలోకి రప్పిస్తే కాపులు పవన్ వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వైసీపీ కీలక నాయకులు ఈ ఇద్దరి నేతలను ఎలాగైనా వైసీపీలోకి రప్పించేందుకు కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం ఇటీవల రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అనుచరులు, అభిమానులకు సమాలోచనలు జరిపారు. రాజకీయ భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిర్లంపూడిలోనే ముద్రగడ నివాసం అభిమానులతో కిక్కిరిసినట్లు సమాచారం. త్వరలో ముద్రగడ రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారని.. ఆయన ఎన్నడూ రాజకీయాలకు దూరం కాలేదని ఆయన కుమారుడు మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఆయన వైసీపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వంగవీటి రాధాకృష్ణను సైతం వైసీపీలోకి రప్పించేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం తర్వాత రాధాకృష్ణ జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వకపోవడంతో రాధాకృష్ణ టిడిపిలోకి జంప్ అయ్యారు. కానీ టిడిపి అధికారంలోకి రాకపోవడంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. ఇటీవల టిడిపి కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. అయితే వైసీపీలోకి వస్తే సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని.. కోరుకున్న అవకాశాలు ఇస్తామని ఎంపీ మిధున్ రెడ్డి ద్వారా జగన్ రాయభారం పంపినట్లు తెలుస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా రాధాకృష్ణ పెద్దగా మొగ్గు చూపడం లేదని సమాచారం. ఇప్పటికే తరచూ పార్టీలు మారడం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అందుకే వైసిపి ఆఫర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఎంపీ మిధున్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ రాధాకృష్ణ గురించి పెద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కాపుల ద్వారా తనకు జరిగే నష్టాన్ని నియంత్రించేందుకు ఆ ఇద్దరు నేతలను తన వైపు తిప్పుకునేందుకు జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు గట్టి దెబ్బ చూపాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.