Pawan Kalyan: ఏపీలో కమ్ముకుంటున్న విషవాయువులు.. ప్రజల ప్రాణాలు తీస్తున్న వైనంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కడిగేశారు. ఇప్పటికే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ అయ్యి పలువురు ప్రమాదాల బారినపడ్డారని.. తాజాగా అచ్చుతాపురం ఎస్.ఈ.జెడ్ పారిశ్రామిక ప్రాంతంలో విషవాయువులు లీకై ఆస్పత్రి పాలైన బాధితులకు సంఘీభావం తెలిపారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న పరిశ్రమలను మూసివేయాలని.. జగన్ సర్కార్ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

విశాఖనగరం సమీపంలో ఉన్న అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్. పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.. విశాఖలో ఎల్.జి. పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో, ఎంతమంది ప్రాణాలను హరించిందో, వందలాది మందిని శాశ్వత అనారోగ్యానికి గురి చేసిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు..
అచ్యుతాపురం సెజ్ లో మంగళవారం సాయంత్రం దుస్తులు తయారుచేసే సీడ్స్ అనే కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికార గణం నిర్లిప్తతే కారణమన్నారు. ఇదే కంపెనీలో నెల క్రితమే ఇటువంటి ప్రమాదం జరిగిందని… అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇది మళ్లీ పునరావృతం అయ్యిందన్నారు.. ప్రమాదానికి కారణాలు ఏమిటో అటు అధికారులుగాని, ఇటు కంపెనీ ప్రతినిధులుగాని చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారన్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరమన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి కాదని..
పారిశ్రామిక ప్రమాదాలు నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలన్నారు.
ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాలన్నారు. దుస్తుల కర్మాగారం వాయు ప్రమాదంలో అస్వస్తులైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మేలైన వైద్యాన్ని, నష్ట పరిహారాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు..
ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల తప్పిదాలు, పరిశ్రమల దమనకాండపై పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉంటారు. ఏపీలో ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని లేవనెత్తుతూ పరిష్కారం దిశగా పవన్ కృషి చేస్తున్నారు.
[…] Also Read: Pawan Kalyan: ఏపీని కబళిస్తున్న విషవాయువులు.. … […]