
పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఏపీలోని రైతు సమస్యలపై తాజాగా ఆక్రోషించారు.రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈనెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని.. లేనిపక్షంలో రైతుల కోసం పోరాడుతానని పవన్ హెచ్చరించారు.
రైతుల నుంచి ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా దబ్బులెందుకు ఇవ్వడం లదేని పవన్ నిలదీశారు. ఏపీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని.. ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఈ వివరాలను ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా ఏపీ ప్రభుత్వం రైతులకు దాదాపు రూ.3వేల కోట్లకు పైగా బకాయి పడిందని సమాచారం. ఈ రబీ సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ రైతుల కోసం కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపడితే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు చెల్లించింది.
కాగా రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్ లో రైతులకు పంటకు పెట్టుబడి సమకూరుతుంది. బకాయిల కారణంగా ఇప్పుడు కోనసీమలోని రైతులు పంట వేయబోమని క్రాప్ హాలీడే ప్రకటించిన వైనం సంచలనమవుతోంది. ఇదే విషయాన్ని పవన్ గుర్తు చేసి ప్రభుత్వాన్ని నిలదీశారు.
పండించే పంటకు, తినే తిండికి పార్టీ రంగులు పులుముతారా? ఇది దిగజారుడుతనమేనని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల వారీగా రైతులను విడదీసిందని వైసీపీ ప్రభుత్వంపై పవన్ సీరియస్ ఆరోపణ చేశారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వారి నుంచే పంటను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు.
మొత్తం పవన్ కళ్యాణ్ ఏపీ రైతుల పక్షాన నిలిచి మరో పోరుబాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వారిపై సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.