బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. దాని రుచే వేరు. బిర్యానీ రోజు పెట్టినా తినని వారుండరు. అలాంటి బిర్యానీ ఐదు పైసలకే అంటే ఇక అంతేసంగతి. ఇటీవల కాలంలో బిర్యానీ ధరలు కొండెక్కాయి. పెరిగిన ధరలతో కొందరు తినలేకపోతున్నారు. బిర్యానీ ధర కేవలం రూ.5 పైసలే అంటే భోజన ప్రియులు ఆ ప్రాంతంలో క్యూ కడతారు. అలాగే ఓ హోటల్ ప్రమోషన్ కోసం ప్రారంభ ఆఫర్ గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసి పోయాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్ లో సుకన్య బిర్యానీ హోటల్ తాజాగా ప్రారంభించారు. ప్రారంభ ఆఫర్ గా 5 పైసల నాణెం తీసుకొస్తే ఫ్రీగా బిర్యానీ ఇస్తామని అనౌన్స్ చేశారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్ ఓనర్ కు షాక్ తగిలింది.
పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకువచ్చి హోటల్ ముందు క్యూ కట్టారు. దాదాపు 300 మంది ఆ నాణేలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబట్టారు. సగం మంది మాస్కులు పెట్టుకోలేదు. ఇక బౌతిక దూరం అసలు పాటించలేదు. ఊహించనంతమంది రావడంతో యాజమాన్యం హోటల్ షటర్లు మూసేసింది.
ఆలస్యంగా వచ్చిన కొందరు నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో కూడా పలు చోట్ల రెస్టారెంట్లు ప్రమోషన్ కోసం ఇలాంటి ఆఫర్స్ ప్రకటించాయి. దీంతో బిర్యానీ ప్రియులు ఎగబడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా జనం దూసుకురావడంతో యాజమాన్యం నివ్వెర పోయింది. ఇంత మంది దగ్గర ఐదు పైసల బిళ్లలు ఉన్నాయనే విషయం తెలియలేదు. అందుకే ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించి నాలుక కరుచుకున్నారు.