Pawan Kalyan On Mudragada: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ కోసం అన్ని పార్టీలూ చేయని ప్రయత్నం లేదు. కానీ ఆయన మాత్రం జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట జనసేన కీలక నేతలు రెండు గంటల పాటు ముద్రగడతో భేటీ అయ్యారు. నిన్న టిడిపి నేత జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడతో చర్చించారు. ఇదే సమయంలో తనను కలిసేందుకు వస్తానని చెప్పిన వైసీపీ నేత తోట త్రిమూర్తులను మాత్రం నో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అటు సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం ఫోన్లో స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. వారం రోజుల్లో పవన్ తో ముద్రగడ భేటీ కానున్నారని.. అటు తర్వాత జనసేనలో చేరికపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది.
కాపులను వైసీపీ కావాలనే రెచ్చగొడుతూ ఉందని.. వారి ఉచ్చులో పడొద్దని జనసేన అధినేత పవన్ ఇటీవల బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాపు పెద్దలు తిట్టినా దీవెనలుగా తీసుకుంటానని.. నాయకులు ఎవరు వచ్చినా గుమ్మాలు తెరిచే ఉంటాయని లేఖలో పవన్ పేర్కొన్నారు. దీనిపై ముద్రగడ తన అనుచరుల వద్ద సానుకూలంగా స్పందించారు. అక్కడి నుంచే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. బుధవారం రాత్రి జనసేన కీలక నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ తదితరులు ముద్రగడ నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. వారికి ముద్రగడ ఒక లేఖ అందించినట్లు సమాచారం. పవన్ కు ఇవ్వాలని సూచిస్తూ అందించిన ఈ లేఖ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఆ లేఖ పవన్ కు అందిన తరువాత ఇద్దరి భేటీపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అయితే ఆ మరుసటి రోజే టిడిపి నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. వ్యక్తిగతంగా కలిశానని జ్యోతుల నెహ్రూ చెబుతున్నప్పటికీ.. టిడిపి దూతగానే ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీకి ముద్రగడ డోర్ క్లోజ్ చేసినట్లు సమాచారం. రకరకాల ఆశలు చూపి ముద్రగడను తమ వైపు తిప్పుకోవాలని వైసిపి భావించింది. తీరా ఎన్నికలకు సమయానికి టికెట్ విషయంలో కొర్రీలు పెడుతుండడంతో ముద్రగడ మనస్తాపానికి గురయ్యారు. అందుకే వరుసగా జనసేన, టిడిపి నాయకులతో సమావేశం అవుతూ వస్తున్నారు. వైసిపి నాయకులు ఇంటికి వచ్చి చర్చలు జరుపుతామని చెబుతున్నా.. ముద్రగడ మాత్రం వద్దని తేల్చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఫోన్ చేసినా.. ఇక చాలు అంటూ వైసీపీకి దూరమని ప్రకటించారు. సంక్రాంతి రోజుల్లో.. ఏదో ఒక పూట పవన్ ముద్రగడతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాపుల్లో చీలిక తెచ్చి మరోసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని పవన్ అనుకుంటున్నారు. అటు చంద్రబాబు సైతం ముద్రగడ విషయంలో ఒక అడుగు వెనక్కి వేయాలని డిసైడ్ అయ్యారు. జనసేనలో చేరినా తమకు అభ్యంతరం లేదని జ్యోతుల నెహ్రూ ద్వారా వర్తమానం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలకు అందించిన లేఖ పవన్ కు అందిన మరుక్షణం.. ఆ ఇద్దరి భేటీ ఖరారు కానుంది. అయితే జనసేన వర్గాలు మాత్రం ఈ పండుగ పూటే ముద్రగడతో పవన్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.