Pawan Kalyan- Telangana: పొత్తుల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేన వైఖరి పై స్పష్టతనిచ్చారు. ఏపీ పొత్తులు తేలని నేపథ్యంలో వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీనేనా ? అన్న చర్చకు తెరలేపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన ప్రచారరథం వారాహి పూజ కోసం కొండగట్టు ఆంజేయస్వామి గుడిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికైతే బీజేపీతో పొత్తు కొనసాగుతోందని, బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పొత్తుల పై స్పష్టత వస్తుందని అన్నారు. తమ పరిమితిని తెలంగాణ ప్రజలు నిర్ణయించాలన్నారు.
జనసేన శక్తిమేరకు తెలంగాణలో గొంతు వినిపిస్తామని చెప్పారు. తెలంగాణలో కొత్తవారు కలిసి వస్తే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. లేనిపక్షంలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. బీఆర్ఎస్ ఏర్పాటును పవన్ కళ్యాణ్ స్వాగతించారు. మార్పు మంచిదేనని అన్నారు. కొందరు మార్పు కోరుకుంటారని, అలాంటి వారు వేరే పార్టీలోకి వెళ్తారని .. బీఆర్ఎస్ లోకి వెళ్లిన తమ పార్టీ నాయకుల్ని ఉద్దేశించి అన్నారు.

తెలంగాణ, ఏపీలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి జనసేన సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అయితే బంతిని బీజేపీ కోర్టులోకి విసిరారు. బీజేపీ నేతలే పొత్తుల అంశం పై స్పష్టతకు రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల పొత్తు పై స్పష్టంగా ఉన్నారు. కానీ బీజేపీ ఒంటరిగా వెళ్తుందా ? ప్రతిపక్షాలతో కలిసి వస్తుందా ? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.