Telangana BJP: ఫిబ్రవరి నుంచి తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తి తామంటే తామనేలా ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త ముందుంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్ వెనుకబడింది. ఇక అధికార బీఆర్‌ఎస్ రాష్ట్ర రాజకీయాలకంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఆపార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ తెలంగాణ పాలనను, అభివృద్ధిని, ప్రజలను మర్చిపోయారని ప్రచారం మొదలు పెట్టింది. జై తెలంగాణ నినాదాన్నే కేసీఆర్ పక్కన పడేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంగా రాష్ట్రంలో మరింత బలపడాలని బీజేపీ అధిష్టాని రాష్ట్ర నేతలను ఆదేశించింది. పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాలు సభలు, సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. నియోజకవర్గాల వారీగా బలాలు, బలహీనతలు గుర్తించాలని, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలని, అన్నివర్గాలకు పార్టీని చేరువ చేయాలని కమలనాథులు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు పార్టీ రాష్ట్రశాఖ కార్యచరణ రూపొందిస్తోంది.

పాలుమూరు వేదికగా కార్యవర్గ సమావేశాలు..
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పాలమూరు వేదికగా బీజేపీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన మంగళవారం జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించిన అంశాలపై చర్చించనున్నారు.
ఎన్నికలే అజెండాగా..
అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమవ్వడమే ప్రధాన అజెండాగా రెండు రోజులు మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లిలోని బీజేపీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేయాలనే అంశంపైనా సమాలోచనలు చేయనున్నారు.
సంస్థాగతంగా బలోపేతం చర్చ
ఈ సమావేశాల్లో ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన.. పోలింగ్ బూత్ సమ్మేళనాలు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనా చర్చించనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలను.. ఈ నెల 28, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న.. జిల్లా కార్యవర్గ సమావేశాల్లో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మండల కార్యవర్గ సమావేశాల్లోనూ నేతలకు పలు అంశాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ నెల 29న నిర్వహించనున్న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ నిర్వహణను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. స్వశక్తి మండల్, సక్రియ పోలింగ్ బూత్, పన్నా ప్రముఖ్ కార్యకలాపాలతోపాటు భవిష్యత్ కార్యక్రమాల యోజన, పరీక్ష పే చర్చ వంటి అంశాలే అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి.

దక్షిణ తెలంగాణపై యాక్షన్ ప్లాన్..
వచ్చే ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై పాలమూరు వేదికగా యాక్షన్‌ప్లాన్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి మోదీ లేదా హోం మంత్రి అమిత్‌షా పోటీ చేస్తారనే చర్చ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఈ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బీజేపీ ఉత్తర తెలంగాణలో పటిష్టంగానే ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో అనుకున్నంత ఊపు ఇప్పటికీ రాలేదని భావిస్తున్న హైకమాండ్, పాలమూరు వేదికగా రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కృష్ణా జలాల వినియోగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నారు.